బాబు ఆదేశాలతోనే అనుచిత వ్యాఖ్యలు: రోజా

22 Dec, 2014 15:06 IST|Sakshi
బాబు ఆదేశాలతోనే అనుచిత వ్యాఖ్యలు: రోజా

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక అధికారపక్షం వ్యక్తిగత దూషణలకు దిగుతోందని ఆమె మండిపడ్డారు. అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ కూడా ఇవ్వలేదన్నారు. చంద్రబాబు భస్మాసురుడిలా వ్యవహరిస్తున్నారని రోజా ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల తలపై చేయిపెట్టి మోసం చేయాలని చూస్తున్నారన్నారు. ప్రజలు తిరగబడి చంద్రబాబు నెత్తిన ఆయన చేయినే పెట్టించి భస్మం చేస్తారని రోజా స్పష్టం చేశారు.

 

ఓడిపోయిన నేతలను, దొంగలకు ప్రభుత్వ కమిటీల్లో అవకాశం కల్పిస్తున్నారన్నారు. తనపై ఉన్న కేసులపై కోర్టు నుంచి స్టే తెచ్చుకోకపోతే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వచ్చేదన్నారు. చంద్రబాబు చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని కాంగ్రెస్ తో చేతులు కలిపి తనపై కేసులు రాకుండా చూసుకున్నారని రోజా అన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారన్నారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, యానిమేటర్ల సమస్యలపై ప్రభుత్వం వద్ద సమాధానం లేదన్నారు. అందుకే డాక్టర్ వైఎస్ఆర్ ను, వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని రోజా దుయ్యబట్టారు.

 

బుచ్చయ్య చౌదరి తన సీనియారిటీని ప్రక్కన పెట్టి తోటి ఎమ్మెల్యే అయిన తనపై వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందన్నారు. చంద్రబాబుతో బుచ్చయ్య చౌదరి మాట్లాడిన తరువాతే ఆయన అలాంటి మాటలు వాడారని.. ఒకసారి అసెంబ్లీ రికార్డులను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుందని రోజా తెలిపారు.అసెంబ్లీ సాక్షి చంద్రబాబు అసత్యాలు చెప్తున్నారని.. ఆయన దేవుడే అయితే ఐకేపీ యానిమేటర్లను ఎందుకు అరెస్టు చేస్తున్నారని నిలదీశారు.

మరిన్ని వార్తలు