రాజధాని నిర్మాణంపై స్పష్టత లేదు : బాలసుబ్రహ్మణ్యం

12 Jul, 2019 17:41 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధికి అద్దం పట్టిందన్నారు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బడ్జెట్‌ సంక్షేమం వైపు మొగ్గు చూపిందన్నారు. విద్యారంగానికి గతంలో కంటే ఎక్కువ కేటాయింపులు చేశారని ప్రశంసించారు. పౌరులకు నేరుగా నగదు రూపంలో సాయం అందించే ప్రయత్నం బాగుందన్నారు. అయితే బడ్జెట్‌లో జలవనరులకు, పట్టణాభివృద్ధికి, మౌలిక వసతులకు ఎక్కువ కేటాయింపులు చేయకపోవడం బాధాకరం అన్నారు. ఉపాధి, మౌలిక వసతులు, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలపై సమతుల్యత లేదన్నారు. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పడం విశేషమన్నారు.

కడప స్టీల్‌ ఫ్యాక్టరీ గురించి స్పష్టత లేదు : లక్ష్మణరావు
రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నవరత్నాలు, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. విభజన హామీల్లో కడప ఉక్కు ఫ్యాక్టరీకి రూ. 259  కోట్లు కేటాయించారు. అయితే దీన్ని కేంద్రం చేపడతుందా.. పీపీపీల కింద చేపడతారా అన్న అంశంపై స్పష్టత లేదన్నారు. రాజధాని నిర్మాణంపై కూడా స్పష్టత లేదని ఆరోపించారు. జలవనరులకు 22 శాతం కేటాయింపులు తగ్గాయన్నారు.

వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత : కత్తి నరసింహరావు
రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కత్తి నరసింహ రావు. బడ్జెట్‌ వల్ల 45 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి పథకం కింద లబ్ధి చేకూరుతుందన్నారు. సీపీఎస్‌ రద్దుపై నిర్దిష్ట కాల పరిమితిలో రద్దు ప్రస్తావన చేయలేదన్నారు.

మరిన్ని వార్తలు