ఇరు రాష్ట్రాల్లో మూడేసి ఎమ్మెల్సీ స్థానాలు పెంపు

10 Sep, 2014 01:17 IST|Sakshi
ఇరు రాష్ట్రాల్లో మూడేసి ఎమ్మెల్సీ స్థానాలు పెంపు

త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు
పెంపునకు సిఫార్సు చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సీఈఓ లేఖ
స్థానిక ఎమ్మెల్సీ స్థానాల, నియోజకవర్గాల పునర్విభజనపై ఈసీ సమీక్ష
సీఈఓ కార్యాలయాలకు పోస్టుల మంజూరుపై సీఎస్‌లకు లేఖలు

 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనమండలిలో స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాల సంఖ్యను మూడేసి చొప్పున పెంచేం దుకు కేంద్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు పంపనుంది. స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాల పునర్విభజన, ఎమ్మెల్యే సీట్ల పెంపునకు నియోజవర్గాల పునర్విభజన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఢిల్లీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌తో పాటు కేంద్ర హోం, న్యాయ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసన మం డలిలో స్థానిక నియోజవర్గాల ఎమ్మెల్సీ స్థానాలు 17 మాత్రమే ఉండాల్సి ఉంది. అలాగే తెలంగాణ శాసనమండలిలో స్థానిక నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల సంఖ్య 14 ఉండాల్సి ఉంది. అయితే ఏపీ మండలిలో స్థానిక నియోజకవర్గాల ఎమ్మెల్సీలు 20మంది ఉండగా తెలంగాణలో 11 మందే ఉన్నారు. తొలుత  ఏపీలో మూడు స్థానిక నియోజవర్గాలను తగ్గించాలని, తెలంగాణలో మూడు పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కేంద్రాన్ని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంలో జోక్యం చేసుకుని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సంపత్ తో సంప్రదించారు. ఏపీలో స్థానిక ఎమ్మెల్సీ స్థా నాలను తగ్గించబోమని, వాటిని పెంచాలని కో రారు. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఏపీలో, తెలంగాణ లోనూ ఎమ్మెల్సీ స్థానాలను మూడుకు పెంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నిర్వహించిన సమావేశంలో చర్చించింది. ఏపీ లో మూడు ఎమ్మెల్సీ స్థానాల తగ్గింపు చేయకుం డానే ఆ మేరకు మూడు స్థానాలను పెంచుతూ తెలంగాణలో కూడా మూడు స్థానాలను పెం చుతూ ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్‌కు పం పించాలని సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఎమ్మెల్సీల స్థానాల సంఖ్య 53కు పెరుగుతుంది. అయితే తెలంగాణలో మాత్రం 40 స్థానాలే ఉంటాయి.

వేర్వేరుగా ఈసీఓ కార్యాలయాలకు  పోస్టులు మంజూరు చేయండి

విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయాలకు తగినన్ని పోస్టులను మంజూరు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులు ఇరు రాష్ట్రాలకు పంపిణీ అనంతరం రెండు ప్రభుత్వాలు సీఈఓ కార్యాలయాలకు పోస్టులను మంజూరు చేయనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
 
నియోజకవర్గాల పునర్విభజనపై సమీక్ష


రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో ఎమ్మెల్యే స్థానాలను 119 నుంచి 153కు, ఏపీలో ఎమ్మెల్యే స్థానాలను 175 నుంచి 225కు పెంచాల్సి ఉన్నందున నియోజవర్గాల పునర్విభజనపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం సమీక్ష నిర్వహిం చింది. 2011 ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉంది. ఇందుకు సంబంబంధించిన పూర్తి సమాచారాన్ని, మ్యాప్‌లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం మరింత సమాచారం కోసం కేంద్ర హోంశాఖను కోరింది.
 
 

మరిన్ని వార్తలు