శనగ ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించండి

14 Dec, 2017 03:50 IST|Sakshi

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి లేఖ

సాక్షి, వేముల : రబీలో సాగు చేసిన శనగపంటకు ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, కార్యదర్శి ఎఫ్‌ఎం పట్నాయక్‌లకు బుధవారం లేఖ రాశారు. బీమా చెల్లింపు గడువు పెంచాలని పట్నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వైఎస్సార్‌ జిల్లాలో 80 వేల హెక్టార్లలో రబీలో శనగ పంట సాగైందని, 50 వేల మందికి పైగానే రైతులు ప్రీమియం చెల్లించేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. ప్రీమియం చెల్లించేందుకు మూడు రోజులే గడువుందని, రైతులందరూ గడువులోగా చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

తీవ్ర వర్షాభావం, తెగుళ్లతో పంటలు దెబ్బతింటే ఫసల్‌ బీమా వర్తిస్తుందన్న ఉద్దేశంతో రైతులు పంటకు ప్రీమియం చెల్లించేందుకు వారం నుంచి ఎదురుచూస్తున్నారన్నారు. ప్రీమియం మీసేవ ద్వారా చెల్లించేందుకు వెళ్లగా వెబ్‌సైట్‌ తెరుచుకోలేదన్నారు. బ్యాంక్‌లలో డీడీల రూపంలో ప్రీమియం చెల్లించాలని వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయని తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో వేలమంది బ్యాంక్‌లలో డీడీలు తీయాలంటే సాధ్యమయ్యే పనికాదని లేఖలో పేర్కొన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రీమియం చెల్లించేందుకు మరో వారం గడువు ఇవ్వాలని కోరారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే శనగ పంటకు ప్రీమియం చెల్లించడంలో ఆలస్యమైందని, చర్యలు తీసుకోవాలని  అవినాశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు