ఎంపీటీసీల వేతనం స్వాహా

3 Mar, 2016 02:39 IST|Sakshi

ఫోర్జరీ సంతకాలతో ఎంపీటీసీల జీతం స్వాహా చేసిన వైనం
ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌కు ఎంపీటీసీ సభ్యురాలి ఫిర్యాదు

 
సంక్షేమ పథకాలు.. సామాన్యులకు ఇచ్చే సబ్సిడీలు.. పింఛన్లు తదితర వాటిల్లో ప్రభుత్వ శాఖల సిబ్బంది స్వాహా చేయడం మామూలే. అయితే ఆ మండల కార్యాలయ సిబ్బంది ఏకంగా ప్రజాప్రతినిధులకే టోకరా వేశారు. వారి వేతనాలను స్వాహా చేశారు. ఓ ఎంపీటీసీ సభ్యురాలు ఎమ్మెల్యే సునీల్ కుమార్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. విషయం తెలుసుకున్నవారు ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

తిరుపతి: ఏకంగా ఎంపీటీసీ సభ్యులకే మస్కా కొట్టి వారి వేతనాలను స్వాహా చేసిన సంఘటన ఐరాల మండలంలో కలకలం రేపుతోంది.  ఈ విషయాన్ని ఓ ఎంపీటీసీ సభ్యురాలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని, ఆరా తీశారు. ప్రజాప్రతినిధుల వేతనాల పంపిణీలో సిబ్బం ది చేతివాటం ప్రదర్శించినట్లు తేలడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే... ఐరాల మండలంలో 14 మంది ఎంపీటీసీ సభ్యులున్నారు. 20 14లో వారుఎన్నికైన సమయంలో గౌరవ వేతనం రూ.750 ఉండేది. వారు జూన్ 2015 వరకు  జీతాలుడ్రా చేసినట్లు రికార్డుల్లో ఉంది. వాస్తవానికి  ఏప్రిల్ వరకే వేతనం అందింది. అటు తర్వాత ఇంతవరకు జీతం చెల్లించలేదు. అక్టోబర్ 2015 నుంచి వీరి జీతంరూ.3,000 చేశారు.
 
గుట్టు రట్టయింది ఇలా...
తనకు  రెండేళ్లుగా జీతం రావడం లేదని కోళ్లపల్లె ఎంపీటీసీ సభ్యురాలు చిలకమ్మ ఇటీవల పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన చిత్తూరులోని జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)కు వెంటనే ఫోన్ చేశారు. ఎంపీటీసీ సభ్యుల  జీతాల విషయమై ఆరా తీయగా నిధులను విడుదల చేసినట్లు ఆయన వివరించారు. దీంతో ఆయన ఎంపీడీఓను జీతాల విషయమై ప్రశ్నిం చారు. డొంక తిరుగుడు సమాధానం రావడంతో ఎమ్మెల్యేకి అనుమానం వచ్చింది. వెంటనే ఐరాల మండల పరి షత్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్క డ ఎంపీడీవో పార్వతమ్మ సమక్షంలో కార్యాలయ రికార్డులను తనిఖీ చేయగా, అక్విటెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు ఫోర్జరీ చేసి జీతాలు స్వాహా చేసిన విషయం, కొట్టివేతలను గమనించారు. ఎంపీటీసీ సభ్యురాలు చిలకమ్మను కార్యాలయానికి పిలిపించి సంతకాలు పరిశీలించగా ఫోర్జరీ అని తేలింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలను పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈవిషయమై ఎంపీడీవో పార్వతమ్మను వివరణ కోరగా గత సంవత్సరం పంపిణీ చేసిన గౌరవ వేతనంలో రెండు నెలలకు సంబంధించిన వివరాలు రికార్డుల్లో తారుమారయ్యాయన్నారు.  లెక్కల్లో ఎక్కడ పొరపాటు జరిగిందో పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు.
 

మరిన్ని వార్తలు