కట్టి వదిలేశారంతే!

23 Oct, 2017 08:38 IST|Sakshi

30 ఏళ్ల నుంచి నిరుపయోగంగా ఉన్న ముచ్చుకోట రిజర్వాయర్‌

నీటితో నింపితే పుట్లూరు, శింగనమల, పెద్దపప్పూరు మండలాలకు ఊరట

పెద్దపప్పూరు: మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో ఉన్న ముచ్చుకోట రిజర్వాయర్‌ను ప్రారంభించి దాదాపు 30 ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు నీటి కేటాయింపులు లేవు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు దాని గురించే పట్టించుకోకపోవడంతో అది శిథిలావస్థకు చేరుకుంది. మండలంలోని ముచ్చుకోట రిజర్వాయర్‌ను అప్పట్లో దాదాపు రూ.కోటి వ్యయంతో నిర్మించారు. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు దీనిని ప్రారంభించారు. దీనికోసం దాదాపు 300 ఎకరాలు సేకరించారు. నార్పల మండలం తుంపెర డెలివరీ పాయింట్‌ నుంచి సుబ్బరాయసాగర్‌కు, అక్కడి నుంచి ముచ్చుకోటకు నీరు వస్తుంది.

ఇది నిండితే పెద్దపప్పూరులోని ముచ్చుకోట, వరదాయపల్లి, చిక్కేపల్లి, నామనాంకపల్లి, షేక్‌పల్లి గ్రామాలతోపాటు పుట్లూరు మండలంలోని పలు గ్రామాలకు భూగర్భజలాలు పెరిగి తాగునీరు, సాగునీరు అందుతుంది. కానీ నీరన్నదే లేక నిరుపయోగంగా మారడంతో రిజర్వాయర్‌ శిథిలావస్థకు చేరుకుంటోంది. ఇప్పటికే రాతిబండింగ్‌(రాతికట్టడం) కృంగిపోయింది. రిజర్వాయర్‌కు నీరు చేరే కాలువ కూడా దెబ్బతింది. ముళ్లపొదలతో నిండిపోయింది.

అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలానే వదిలేస్తే ఇది ఎందుకూ పనికి రాకుండా పోతుందని మండలంలోని ఆయా గ్రామాల రైతులు, గ్రామస్తులు వాపోతున్నారు. శ్రీశైలం డ్యామ్‌కు నిండా నీరు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి ముచ్చుకోట రిజర్వాయర్‌కు నీరు విడుదల చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

నీరు విడుదల చేయాలి
రిజర్వాయర్‌ నిర్మించినప్పటి నుంచి నీటి కేటాయింపులు లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. కోట్లాది రూపాయలు వెచ్చించి చేపట్టిన నిర్మాణం ఎందుకూ ఉçపయోగపడకుండా పోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీరివ్వాలి.     – మల్లికార్జున, ముచ్చుకోట

మరిన్ని వార్తలు