'2050 వరకూ మమ్మల్ని ఏలుతారా?'

27 Aug, 2017 10:37 IST|Sakshi
'2050 వరకూ మమ్మల్ని ఏలుతారా?'

సాక్షి, కిర్లంపూడి: పాదయాత్రను అడ్డుకుని తమను బందెలదొడ్లో పశువుల్లా ఒకే చోట కట్టేశారని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డకున్నారు. అనంతరం ఆయన కిర్లంపూడిలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాదయాత్రకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి అందించి, రూట్‌ మ్యాప్‌ కూడా పంపామని చెప్పారు. అయినా కూడా అడ్డుకోవడం దారుణమని అన్నారు.

'నేనేం పాపం చేశానో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలి. సీఎం గారి మీద దండయాత్ర చేసేంత ధైర్యం, దమ్మూ మాకు లేదు. అనవసరంగా పాదయాత్రపై ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో తెలీడం లేదు. పోలీసులు కూడా సీఎంకు వంత పాడటం సిగ్గుచేటు. నేను ఎందుకు నడవకూడదో.. ఎవరూ చెప్పడం లేదు. ఇక్కడేమైనా బ్రిటిష్‌ పాలన సాగుతోందా?. ఏంటి నిర్భందం. ఎంతకాలం ఇలా. నాకు సమాధానం కావాలి. సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కాపులకు ఏం చేసిందని అన్నారు. అధికారంలో ఉన్న మీరు, మీ మావయ్య గారు 1995లో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదో చెప్పాలి. మీరు చేయాల్సింది ఎందుకు చేయలేదో చెప్తే మిగతావి ఎందుకు చేయలోదో నేను చెప్తా.

మీరు మాకు ఇచ్చిన హామీని అమలు చేయలేకపోతున్నారు. మా జాతిని చులకనగా చూస్తున్నారు. నంద్యాల, కాకినాడలో కులాల పేరుతో మీరు చేసిందేంటి. మీ ఓట్ల కోసం, అధికారం కోసం కులాలను అడ్డుపెట్టుకుని.. లేనిపోని ఆశలు కల్పిస్తున్నారే. సరే ఆ ఆశలను తీర్చాలని అడిగితే అణచివేస్తున్నారే. కులాల వాళ్లు రోడ్డు మీదకు రావడానికి కారణం మీరే ముఖ్యమంత్రి గారు. ఎక్కడ లేని కోపం మీకు ఎందుకు వస్తుంది?. అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని హామీలు అమలు చేయమని అడిగే హక్కు లేదా?. మీరు, మీ కుమారులు, మీ మనవడు 2050 వరకూ పదవుల్లో సాగాలా?. మేం మీ పాద సేవ చేయాలా? మీకు బానిసల్లా ఉండాలా?. పోలీసులను పంపి మమ్మల్ని భయభ్రాంతులను చేయాలని చూస్తున్నారు.

పోలీసులతో పాలన చేయాలని చూసిన ప్రభుత్వాలు ఏవీ కూడా మనుగడ సాగించలేవు. ఎంతో కాలం నుంచి వేచి చూశాం. మా జీవితాలు ఇలానే విసిగి వేశారి పోవాలా?. మీరు కుల మీటింగ్‌లు పెట్టొచ్చు. ఇతర కులాలు మాత్రం సమిష్టిగా రోడ్ల మీదకు రాకూడదు. దేశానికి, దేశంలోని అన్ని కులాలకు స్వతంత్రం వచ్చింది. కానీ మా జాతికి ఇంకా స్వతంత్రం రాలేదని మేం భావిస్తున్నాం. మేం వేరే దేశం నుంచి వచ్చామని ఓ కాగితం ఇవ్వండి. రోడ్ల మీదకు రాము. మా బతుకులు మేం బతుకుతాం. ఈ అణచి వేత ధోరణి మానుకోవాలని తెలియజేస్తున్నాను.'