రుణమాఫీ కాదు... డబ్బులు కట్టండి

15 Aug, 2014 03:51 IST|Sakshi

దర్శి:  రుణ మాఫీ అవుతుందన్న ఆశతో ఎదురు చూస్తున్న రైతన్నలకు బ్యాంకర్లు నోటీసులు పంపుతుండడంతో కంగుతింటున్నారు. దర్శి మండలంలోనే 25,579 అకౌంట్లకుగాను రూ.195.5 కోట్లు మాఫీ కావాల్సిన రుణాలున్నాయి. వీటిలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7431 ఖాతాలకు రూ.53కోట్ల రుణాలు, సిండికేట్ బ్యాంకులో 6,500 ఖాతాలకు రూ.57 కోట్ల రుణాలు, ఆంధ్రాబ్యాంకులో 5465 ఖాతాలకు రూ.44.50  కోట్లు, సహకార బ్యాంకులో 4,338 ఖాతాలకు రూ.20 కోట్లు,  ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో 1845 ఖాతాలకు 16,18,89000 వేల రూపాయల రుణాలు బకాయిగా ఉన్నాయి.

  నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో ఇంకో రూ.100 కోట్ల వరకు రుణాలు మాఫీ కావాల్సి ఉంది.  రుణమాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు ... కొద్ది రోజులు ఆగండంటూ రైతులు అభ్యర్థిస్తుంటే ..టీడీపీ నేతలు చెబితే మేం లోన్లు ఇచ్చామా ...  లోన్ కడితే కట్టండి లేకుంటే వెంటనే వేలం వేస్తామంటూ బ్యాంకర్లు చెబుతుండడంతో రైతన్నల్లో అయోమయం నెలకుంది.

మరిన్ని వార్తలు