సంపూర్ణ గిరిజన విద్యాభివృద్ధే లక్ష్యం

28 May, 2014 00:34 IST|Sakshi
సంపూర్ణ గిరిజన విద్యాభివృద్ధే లక్ష్యం

 పాడేరు, న్యూస్‌లైన్ : వచ్చే విద్యా సంవత్సరంలో సంపూర్ణ గిరిజన విద్యాభివృద్ధి లక్ష్యంతో ఉపాధ్యాయులంతా చిత్తశుద్ధితో పని చేయాలని గిరిజన సంక్షేమ డీడీ, ఇన్‌చార్జి ఏజెన్సీ డీఈఓ బి.మల్లికార్జునరెడ్డి ఆదేశించారు. తలారిసింగి ఆశ్రమ పాఠశాల భవనంలో అరకులోయ, అనంతగిరి మండలాలకు చెందిన అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మంగళవా రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక విద్య పటిష్టానికి ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. మెరుగైన ప్రాథమిక విద్యతోపాటు పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
 
ఎస్‌ఎస్‌ఏ నిధులతో చేపట్టిన అదనపు భవనాల నిర్మాణాలను కూడా వేగవంతం చేస్తామన్నారు. పాఠశాలల అభివృద్ధికి రాజీవ్ విద్యామిషన్, ఎస్‌ఎస్‌ఏ నిధులను పారదర్శకంగా ఖ ర్చు పెట్టాలన్నారు. అన్ని పాఠశాలల కు గత విద్యా సంవత్సరంలో మంజూ రైన నిధులతో రంగులు వేయించాలని ఆదేశించినా కొన్ని పాఠశాలల్లోనే పనులు జరిగాయని చెప్పారు. మిగతా పాఠశాలల్లో పనులను కూడా విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా పూర్తి చేయాలన్నారు.
 
రాజీవ్ విద్యా దీవెన పథకం కింద 5 నుంచి 8వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలల్లో చదివే ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. అన్ని పాఠశాలలకు తరగతుల వారీగా పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, వెంటనే ఉపాధ్యాయులు తీసుకెళ్లాలని సూచించారు. విద్యార్థులకు యూని ఫాం పంపిణీకి చర్యలు తీసుకున్నామన్నారు. వస్త్రాలు సిద్ధంగా ఉన్నాయని, కుట్టుకూలి నిధులు కూడా ఆర్వీఎం పథకం కింద మంజూరయ్యాయన్నారు. సమావేశంలో అరకులోయ ఎంఈఓ సువర్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు