మిస్టరీ మర్డర్స్

27 Oct, 2014 02:19 IST|Sakshi

ప్రొద్దుటూరు క్రైం:
 ప్రొద్దుటూరు పట్టణం శ్రీరాంనగర్‌లో సంచలనం సృష్టించిన ముగ్గురు మహిళల హత్య కేసుల మిస్టరీని పోలీసులు ఇప్పటికీ ఛేదించలేదు. ముగ్గురు మహిళల్లో ఒక మహిళ ఎర్రగుంట్ల మండలం గోపులాపురం వద్ద హత్యకు గురికాగా, మరో మహిళ ముద్దనూరు మండలం కమ్మవారిపల్లెలో హత్యకు గురైంది. వీరిలో ఒక మహిళను మాత్రం శ్రీరాంనగర్‌లో హత్య చేశారు.

తొలుత ప్రొద్దుటూరు, ముద్దనూరు, ఎర్రగుంట్ల పోలీసులు ఉమ్మడిగా దర్యాప్తు చేశారు. హత్యకు గురైంది ప్రొద్దుటూరు వాసులే కావడంతో ఇక్కడి పోలీసుల ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగిందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ముద్దనూరు, ఎర్రగుంట్ల మండలాల పోలీసులు తమ పరిధిలో జరిగిన రెండు హత్య కేసులను గాలికి వదిలేసినట్టు కనిపిస్తోంది. ప్రొద్దుటూరు పోలీసులు కూడా  ఆ రెండు హత్య కేసులను పట్టించుకోకపోవడంతో ఈ కేసులో దర్యాప్తు మందగించింది.

 హంతకులు ఎవరు..?
 ప్రొద్దుటూరులోని శ్రీరాంనగర్‌లో 2013 ఫిబ్రవరి నెలలో మహిళలు హత్యలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఫిబ్రవరి 26న శ్రీరాంనగర్‌లోని భీమునిపల్లె లక్ష్మిదేవి హత్యకు గురైంది. ఆమె గాజుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేది. ఆమె ఇంటి నుంచి 25న వెళ్లిపోగా 26న ఉదయం ఎర్రగుంట్ల మండలంలోని గోపులాపురం వద్ద శవమై కనిపించింది.

గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఆమెను హత్య చేసి మృతదేహాన్ని కాల్చారు. అలాగే  ఈ హత్య జరిగిన రెండు నెలలలోపే ఏప్రిల్ 29న శ్రీరాంగనర్‌లోని చౌడమ్మ వీధిలో నివాసం ఉంటున్న మేరువ శారదను హత్య చేశారు. ఆమె భర్త వాసుదేవరావు వస్త్ర దుకాణంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు.  శారద ఇంటి దగ్గరే రేషన్(చేనేత వృత్తి) వడుకుతుంటుంది. ఆమె భర్త దుకాణం నుంచి 29న మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. భార్య ఇంట్లో లేకపోవడంతో వీధిలో గాలించాడు.

కనిపించకపోవడంతో 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అదే రోజు ముద్దనూరు మండలం కమ్మవారిపల్లె గ్రామ సమీపంలోని రోడ్డు పక్కలో ఆమె మృతదేహం పడి ఉంది. తర్వాత అదే ఏడాది జూన్ 3న శ్రీరాంనగర్‌లో గొంటుముక్కల రంగమ్మ అనే వృద్ధురాలిని హత్య చేశారు. ఆమెను హత్య చేసిన నిందితులు మృతదేహాన్ని సంచిలో వేసి మురికి కాలువలో పడేశారు.
 
 నీరుగారుతున్న హత్య కేసులు
  మహిళల హత్యలు జరిగి ఏడాదిన్నర దాటినప్పటికీ పోలీసులు మాత్రం నిందితులను గుర్తించలేకపోయారు. దీంతో తమ వారిని ఎవరు హత్య చేశారు ? ఎందుకు హత్య చేశారో తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు నాలుగైదు నెలల క్రితం వరకూ ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇప్పుడు ఆ కేసుల గురించి పట్టించుకోకపోవడంతో ఇక ఆ కేసులను పూర్తిగా పక్కన పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇకనైనా పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకుని ఈ హత్యల మిస్టరీని ఛేదిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు