వీడిన వలంటీర్‌ హత్య కేసు మిస్టరీ

4 Oct, 2023 11:32 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శివనారాయణస్వామి

ఆదోనిఅర్బన్‌: గతనెలలో పట్టణంలో జరిగిన వలంటీర్‌ హరిబాబు హత్య కేసును ఆదోని టూటౌన్‌ పోలీసులు ఛేదించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. మంగళవారం డీఎస్పీ శివనారాయణస్వామి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసముంటున్న ఈరమ్మ కుమారుడు హరిబాబు భరత్‌నగర్‌ సచివాలయంలో వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అదే కాలనీలో ఉన్న భీమన్న భార్యను మృతుడు వేధించేవాడు. మహిళ కుటుంబసభ్యులు పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోగా గణపతి వేడుకల్లో కూడా ఆమెను వేధించాడు.

గమనించిన భర్త భీమన్న హత్యకు పథకం రచించాడు. ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి హరిబాబును మాయమాటలు చెప్పి బహిర్భూమికి తీసుకెళ్లి గొడ్డలితో నరికి చంపేశాడు. అదే రోజు రాత్రి ఇంటికి వెళ్లి తండ్రి ఈరన్నకు విషయం చెప్పాడు. ఆయన సలహా మేరకు ఆధారాలు దొరకకుండా హత్య సమయంలో వేసుకున్న దుస్తులను కాల్చివేశాడు. 21వ తేదీ ఉదయం కుమారుడి హత్య విషయం తెలుసుకున్న తల్లి ఈరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు హతుడి ఫోన్‌ కాల్స్‌, సీసీ ఫుటేజీ ఆధారంగా హంతకులను గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు.

విషయం తెలుసుకున్న భీమన్న, అతని తండ్రి ఈరన్న మండిగిరి వీఆర్వో రాజశేఖర్‌ ముందు లొంగిపోయారు. వారు హత్యకు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. కేసు ఛేదించిన టూటౌన్‌ సీఐ శ్రీనివాసనాయక్‌, వన్‌టౌన్‌ సీఐ విక్రమసింహ, హెడ్‌కానిస్టేబుల్‌ సుదర్శన్‌, కానిస్టేబుల్‌ ఆంజనేయులు, హోంగార్డు గోవర్ధన్‌ను ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు.

మరిన్ని వార్తలు