నల్లమలలో నిఘా నేత్రాలు

21 Aug, 2015 02:45 IST|Sakshi
నల్లమలలో నిఘా నేత్రాలు

పెద్దదోర్నాల : నల్లమల పరిరక్షణకు అటవీశాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అటవీశాఖ ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నల్లమల పరిసరాల్లోని ఫారెస్టు చెక్‌పోస్టుల వద్ద అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి వాహనంపై డేగకన్ను వేసేలా చర్యలు చేపట్టింది. దీంతో కొంత కాలం నుంచి ప్రమాదాల సంఖ్యతో పాటు, నేరాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన టోల్‌గేట్లలో నల్లమలలో ప్రయాణించే వాహనాల నుంచి పర్యావరణ రుసుం వసూలు చేస్తుండటంతో పాటు అటవీశాఖకు ఏటా రూ.18 లక్షలకుపైగా అదనపు ఆదాయం సమకూరుతోంది.

ఈ నిధులతో నల్లమలలో ప్రయాణికులు జారవిడిచే ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ప్లాస్టిక్ ఫ్రీజోన్‌గా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.  ప్రత్యేకంగా 32 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని ఏర్పాటు చేసి తద్వారా నల్లమల్లలో ప్రయాణించే వారు జారవిడిచే ప్టాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే  అటవీ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆధునిక టెక్నాలజీతో కూడిన వాకీటాకీలను ఉపయోగిస్తున్నారు.

 నిఘా కెమెరాలు, టోల్ గేట్ల ఏర్పాటుతో ఉపయోగాలు ఎన్నో...
 అటవీ సంపద అక్రమ తరలింపు అరికట్టేందుకు  పెద్దదోర్నాల సమీపంలోని గణపతి చెక్‌పోస్టు వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు.  నల్లమలలో హాయిగా విహరించే జంతువులు రోడ్లపై తిరుగుతూ తరుచూ ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్న నేపథ్యంలో నల్లమల అటవీప్రాంతంలో ప్రయాణించే వాహనాల వేగనియంత్రణ, ఈ నిఘా వ్యవస్థ ఏర్పాటుతో మంచి ఫలితాలు వస్తున్నాయి.

 నల్లమలలో ప్రయాణించే వాహనాలు ఏ సమయంలో  చెక్‌పోస్టుల వద్దకు వచ్చాయి. ఎంత సమయం అటవీప్రాంతంలో ప్రయాణించి  అవతలి చెక్‌పోస్టులను దాటాయి. ఇలా  వివరాలన్నీ కంప్యూటర్లు, నిఘా కెమెరాలలో రికార్డు అవుతుండటంతో కేసులు చేధించటం సులభతరంగా మారింది. దీని వల్ల అటవీ ప్రాంతంలో సంచరించే వన్య ప్రాణులకు ప్రమాదం కలిగించే వాహనాలను గుర్తించి వాటిపై కేసులు నమోదు చేయటం, నల్లమలలో జరిగే అక్రమ రవాణా, వన్యప్రాణుల ప్రాణాలను బలిగొనే వాహనాల గుర్తింపుతో పాటు, పోలీసు శాఖకు సంబంధించి ఎన్నో నేరాలు, నేరపూరిత వ్యక్తుల కదలికల గుర్తింపు, ప్రమాదాలకు కారణమైన వాహనాల గుర్తింపు సైతం సులభతరంగా మారింది,
 
చెక్ పోస్టుల వద్ద కంప్యూటర్ ఎన్‌క్లోజర్‌లతోపాటు టోల్‌గేట్, ఎలక్ట్రానిక్ గేటు ఏర్పాటు చేశారు.   నల్లమలలోని ముఖ్య ప్రాంతాల్లో ట్రాప్‌డ్ కెమెరాలను ఏర్పాటు చేసి వన్యప్రాణుల కదలికలతో పాటు ఇతరుల సంచారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.

మరిన్ని వార్తలు