నారాయణను మంత్రి పదవి నుంచి తొలగించాలి

11 Jun, 2014 02:23 IST|Sakshi
నారాయణను మంత్రి పదవి నుంచి తొలగించాలి

కర్నూలు(న్యూసిటీ): నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను రాష్ట్ర నూతన మంత్రివర్గం నుంచి తొలగించాలని అఖిలభారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి సునిల్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణకు మంత్రి పదవి ఇవ్వడంతో కార్పొరేట్ విద్యావ్యవస్థకు మరింత ఆయువు పోసినట్లవుతుందన్నారు.
 
కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు పెరిగిపోయాయని, దీని కారణంగా ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయని వివరించారు. ఎంసెట్, ఇంటర్ వార్షిక ప్రశ్నాపత్రాల లీకేజీలలో నారాయణ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయని వివరించారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సూర్యకుమార్, నగర సంయుక్త కార్యదర్శి ప్రశాంత్, నగర సంఘటనా కార్యదర్శి రంజిత్, రాజేష్, సుభాకర్, సాయి, జనార్ధన్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
విద్యార్థి నాయకుల అరెస్టు, విడుదల...
ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులు సునిల్‌రెడ్డి, సూర్యకుమార్, ప్రశాంత్, రంజిత్, రాజేష్, జనార్దన్, శివ, సతీష్, నంద, ప్రతాప్, సందీప్‌ను పోలీసులు అరెస్టు చేసి మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కలెక్టరేట్ ఎదుట 144వ సెక్షన్ అమలులో ఉందని, ధర్నాలు చేయరాదని పోలీసులు చెప్పారని సునిల్‌రెడ్డి వివరించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.

మరిన్ని వార్తలు