జాతీయ రహదారుల దిగ్బంధం

22 Mar, 2018 11:24 IST|Sakshi
అంకిరెడ్డి పాలెం రహదారి వద్ద జాతీయ రహదారుల దిగ్బంధానికి మద్దతు తెలుపుతున్న వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోపాటు ఇతర పార్టీలు, సంఘాలు నిర్వహిస్తున్న పోరు ఉధృత రూపం దాల్చింది. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా కోసం నేడు (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్బంధించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి మద్దతు తెలిపారు. గుంటూరు నగర శివారులోని అంకిరెడ్డి పాలెం రహదారి వద్ద వైఎస్‌ జగన్‌ మద్దతు తెలిపారు. ఈ దిగ్బంధానికి ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌లోనూ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చింది. కాగా, రహదారుల దిగ్భంధానికి ఇతర పార్టీలు, 45 ప్రజా సంఘాలు కూడా మద్దతిచ్చాయి. 


గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా పోరాటం ఉధృతం.  జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా గుంటూరు శివారులోని హైవేపై ఆందోళనకారులు బైఠాయించారు. ఆందోళనకారులకు వైఎస్‌ జగన్‌ సంఘీభావం తెలిపి హోదా ప్లకార్డులు పట్టుకొని ధర్నాలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రల హక్కు అంటూ ఆయన నినాదం చేశారు. 

అనంతపురం : ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జాతీయ రహదారులను దిగ్బంధంలో భాగంగా కాశ్మీర్‌-కన్యాకుమారి జాతీయ రహదారిపై ఆందోళనలు చేపట్టారు. ఇందుకు వైఎస్‌ఆర్‌సీపీ, వామపక్షాలు మద్దతు తెలిపాయి. 

పశ్చిమగోదావరి : జిల్లాలోని ఏలూరు ఆశ్రమం జాతీయ రహదారి వద్ద దిగ్బందించారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, వామపక్ష పార్టీలు, జనసేన, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని, మధ్యాహ్నపు ఈశ్వరి, కొఠారు అబ్బాయి చౌదరి, బొద్దాని శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. 


చిత్తూరు : జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తనపల్లి క్రాస్‌లో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

https://m.sakshi.com/video/news/national-highways-blockade-special-status-tirupati-1055978
శ్రీకాకుళం :  పలాస వద్ద జాతీయ రహదారిని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా నిర్బంధించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు.

కృష్ణా : కనకదుర్గమ్మ వారధి వద్ద జాతీయ రహదారుల దిగ్బంధంలో భాగంగా వైఎస్‌ఆర్‌సీపీ, వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ప్రతినిధులు రోడ్డుపై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో మల్లాది విష్ణు, పార్ధసారధి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, భవకుమార్‌, సీపీఎం నేత పీ మధు, సీపీఐ నేత కే రామకృష్ణలు పాల్గొన్నారు. 

వైఎస్‌ఆర్‌ కడప :  ప్రత్యేక హోదా కోసం పోరు ఉధృతం. కడప-రాజం పేట బైపాస్‌ వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు. ఇందులో రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకెపాటి అమర్‌నాథ్‌ రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.  

తూర్పుగోదావరి : ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి యువత భారీగా తరలివచ్చింది. రావులపాలెం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఐదవ నంబరు రహరారిపై ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో కాంగ్రెస్‌, వామపక్షాలు, జనసేన నేతలు పాల్గొన్నారు. 

కర్నూలు : జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జాతీయ రహదారిని దిగ్భందం చేశారు. హైవేపై ఆందోళనలో పాల్గొన్న వైసీపీ నాయకులు శిల్పా చక్రపాణి రెడ్డి, బీవౌ రామయ్య, ఎమ్మెల్యేలు గౌరు చరిత, ఐజయ్య, ఇన్‌చార్జ్‌లు హాఫీజ్ ఖాన్, మురళి కృష్ణ, రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసనగా నినాదాలు చేశారు. దీంతో వైసీపీ నాయకులపై పోలీస్ జూలూం విసిరింది. పోలీసులు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలని బలవంతంగా అరెస్ట్ చేశారు. పోలీసుల వైఖరికికు నిరసనగా వైసీపీ కార్యకర్తల ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులనూ అరెస్ట్ చేయడంతో హైవేపై ఉద్రిక్తత నెలకొంది. 

విశాఖపట్నం : పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ అదీప్ రాజ్ ఆధ్వర్యంలో లంకెలపాలెం జాతీయరహదారి దిగ్బంద కార్యక్రమం​ చేపట్టారు. అదీప్ రాజ్‌తో సహ పలువురిని పోలీసులు అరెస్టు చేసి పరవాడ పీఎస్‌కు తరలించారు. 

ప్రకాశం :  జిల్లా ముండ్లమూరు మండలంలో వామపక్షాల ఆద్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక హోదా కోసం రోడ్లను నిర్బంధించారు. అదేవిధంగా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు మార్టూరు జాతీయరహాదారిపై బైటాయించి, నిరసన వ్యక్తపరుస్తున్నారు. దీంతో వాహానాల రకపోకలు నిలిచిపోయాయి.

నెల్లూరు : జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని అయ్యప్ప స్వామి గుడి వద్ద జాతీయ రహదారిపై  వైఎస్‌ఆర్‌సీపీ నేతలు వాహనాలను అడ్డుకున్నారు. ఇందులో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, సీపీఎం నేతలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు నేతలకు మధ్య వాగ్వివాదం నెలకొంది. దీంతో పోలీసులు పలువురి నేతలను అరెస్టు చేశారు. 

విజయనగరం : ఏపి కిప్రత్యేక హోదా, విభజన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో విశాఖ-రాయ్ పూర్ 26వ నంబరు జాతీయ రహదారి దిగ్బందనం. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

మరిన్ని వార్తలు