‘నీట్‌’ రాయాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే

10 Mar, 2017 20:19 IST|Sakshi
‘నీట్‌’ రాయాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే

చిత్తూరు ఎడ్యుకేషన్‌ : రాయలసీమ పరిధిలోని చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో బైపీసీ చదువుతున్న విద్యార్థులకు తిరుపతిలో నీట్‌ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 20న హామీ ఇచ్చారు. ఈ హామీతో రాయలసీమలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తిరుపతికి పరీక్ష కేంద్రం వస్తుందని ఆశించారు. అయితే ప్రస్తుతం పరీక్షలు సమీపిస్తున్నా తిరుపతిలో పరీక్ష కేంద్రం ఏర్పాటుపై మంత్రి కామినేని నుంచి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నీట్‌’కు విద్యార్థులు నమోదు చేసుకున్న వివరాల్లో ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవాలని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ మార్చి 7న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అందులో తిరుపతి పరీక్ష కేంద్రాన్ని చూపకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఎయిమ్స్, ఏపీపీఎస్‌సీ, జిప్‌మర్‌ తదితర పోటీ పరీక్షలు తిరుపతిలో కొంతకాలంగా నిర్వహిస్తున్నారు. నీట్‌ పరీక్షను మాత్రం తిరుపతిలో నిర్వహించడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ‘నీట్‌’ కేంద్రాలు విజయవాడ, విశాఖపట్నంలలో నిర్వహిస్తే తమ పిల్లలు అంత దూరం వెళ్లి పరీక్షలు ఎలా రాయగలరని  తలలు పట్టుకుంటున్నారు. పరీక్ష కేంద్రం మార్పులు, విద్యార్థుల వివరాల పొరపాట్లను వెబ్‌సైట్‌లో సరిదిద్దుకునేందుకు ఈ నెల 12వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు అవకాశం ఉందని ‘నీట్‌’ జాయింట్‌ సెక్రటరీ నోటిఫికేషన్‌లో తెలియజేశారు. ఆ గడువు ముగిసేలోగా ఉన్నతాధికారులు స్పందించి తిరుపతిలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
          

మరిన్ని వార్తలు