బస్సులు కొండెక్కవు

13 Aug, 2013 05:05 IST|Sakshi

 సాక్షి, తిరుపతి: సమైక్యాంధ్ర ఉద్యమం తిరుమల శ్రీవారిని తాకింది. తిరుమలకు బస్సులు నడపడంపై టీటీడీ అధికారులు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. జిల్లా లో 1,350 బస్సు సర్వీసులు ఉన్నాయి. ఒక్క తిరుమలకు మా త్రమే 500 బస్సు సర్వీసులు రోజుకు 3,200 ట్రిప్పులు తిప్పుతున్నారు. జిల్లాకు రోజుకు రూ.1.30 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 13 రోజులుగా సాగుతున్న సమ్మెతో చిత్తూరు జిల్లాలో ఆర్టీసీకి సుమారు రూ.13 కోట్లమేర నష్టం వాటిల్లినట్లు అంచనా. సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన నిరవధిక సమ్మెతో మరింత నష్టం వాటిల్లనుంది. 1975 ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) విధించినపుడు మాత్రమే తిరుమలకు ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. తర్వాత ఇంతవరకు బస్సుల రాకపోకలకు ఆటంకం కలగలేదు. ఇప్పుడు  సమైక్య ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచి తిరుమలకు బస్సులను నిలిపివేసినట్లు ఆర్టీసీ యూనియన్ ప్రకటించింది.
                                  
 ఈ సమ్మె ఢిల్లీని తాకాలి


 సమైక్యవాణి ఢిల్లీకి వినిపించాలంటే తిరుమలకు రాకపోకలను నిలిపివేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ఎన్‌ఎంయూ నాయకులు చల్లా చంద్రయ్య, ప్రభాకర్, బీఎస్‌బాబు, వైఎస్సార్ ఆర్టీసీ యూని యన్ నాయకులు పీసీ బాబు, లతారెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రకాష్ తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలోనే తిరుమలకు బస్సుల రాకపోకలను నిలిపివేసినట్లు వారు గుర్తుచేశారు. శ్రీవారి భక్తులకు అంతరాయం కలిగిస్తున్నందుకు క్షమించాలని కోరారు. సేవల్లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏపీఎస్‌ఆర్టీసీని విభజన పేరుతో రెండు గా చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని, సంస్థను, ఉద్యోగ, కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. తిరుమల రెండు ఘాట్ రోడ్లలో రాకపోకలు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు.
 
 ఎక్కడి బస్సులు అక్కడే


 సీమాంధ్ర జిల్లాల్లో 14 వేల బస్సులను ఎక్కడికక్కడే ఆపేసినట్లు ఆర్టీసీ జేఏసీ నాయకులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం నుంచే దూర ప్రాంతాల  బస్సులను నిలిపివేశారు. గ్రామాల్లో రాత్రిపూట ఉండే పల్లెవెలుగు బస్సులు కూడా అర్ధరాత్రి ఆయా డిపోలకు చేరుకున్నాయి. విషయం తెలుసుకున్న ప్రయాణికులు కొందరు ముందే గమ్యస్థానాలకు చేరుకుంటే, మరి కొందరు రైళ్లు, ప్రైవేటు వాహనాల కోసం తంటాలు పడ్డారు.
 

మరిన్ని వార్తలు