ఇదేం వైఖరి!?

9 Nov, 2015 00:45 IST|Sakshi
ఇదేం వైఖరి!?

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై నో కేసు
పరిశీలనలో ఉందంటున్న పోలీసులు
అటవీ శాఖ తీరుపై అనుమానాలు !

 
కైకలూరు :  నేరం చేసిన వారికి అర్థబలం, అంగబలంతోపాటు అధికారం, రాజకీయ పెద్దల అండ ఉంటే వారిపై పోలీసుల వైఖరి ప్రత్యేకంగా ఉంటుంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా టీడీపీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేసు వ్యవహారం నిలుస్తుంది. శుక్రవారం అర్ధరాత్రి అడ్డగోలుగా అభయారణ్యంలో రోడ్డు వేయించడమే కాకుండా విధులు నిర్వర్తిస్తున్న అటవీ సిబ్బందిపై అనుచరులతో దగ్గరుండి దాడిచేయించిన ప్రభాకర్, కోమటిలంక సర్పంచి జొన్నలగడ్డ శ్యాంబాబు, ఎంపీటీసీ సభ్యుడు గడిదేసి డేవిడ్‌రాజు, గ్రామపెద్ద మంగర నాగరాజుపై అటవీ శాఖ డెప్యూటీ రేంజ్ ఆఫీసరు (డీఆర్వో) జి.ఈశ్వరరావు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. ఇంత జరిగి మీడియాలో చింతమనేని వ్యవహారం రచ్చరచ్చయినా పోలీసులు ఆ దిశ గా విచారణ చేయడానికి ముందుకు       కదలడం లేదు. దీనిపై పరిశీలన ఎంత వరకు వచ్చిందని మీడియా ప్రతినిధులు అడిగితే పోలీసులు ఓ కథ చెబుతున్నారు. ఇప్పటికే అటవీ శాఖ చింతమనేనిపై కేసు నమోదు చేసిందని, ఒకే సంఘటనలో రెండు కేసులు ఎందుకంటూ చట్టానికి కొత్త భాష్యం  చెబుతున్నారు. కేసును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలతో పనిచేస్తామని చెబుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం వల్లే పోలీసులు దాటవేత        దోరణి అవలంభిస్తున్నారని ప్రజలు    భావిస్తున్నారు.


 పోలీసులు, అటవీ సిబ్బంది ఎక్కడ?
 గతంలో జరిగిన మూడు ఘటనల ద్వారా చింతమనేని ప్రభాకర్ కోమటిలంక రోడ్డుపై కన్నేసిన సంగతి స్థానికంగా ఉన్న పోలీసులు, అటవీ సిబ్బందికి తెలుసు. శుక్రవారం రాత్రి, డీఆర్వో జి.ఈశ్వరరావు, కైకలూరు టౌన్ ఎస్‌ఐ షబ్బిర్ అహ్మద్‌కు చింతమనేని ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉందని ముందస్తు సమాచారం ఉంది. అర్ధరాత్రి 1.30 గంటలకు కైకలూరు జాతీయ జాతీయ రహదారిపై పోలీస్ స్టేషన్ల మీదుగా గ్రావెల్‌లోడు ట్రాక్టర్లు వెళ్లాయి. ఘటన స్థలానికి వెళ్లి చింతమనేని ఆగ్రహానికి గురైన అటవీ సిబ్బంది అదే రాత్రి ఫిర్యాదు ఇచ్చారు. తర్వాత కూడా పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లలేదు. ఇదిలా ఉంటే చింతమనేని రోడ్డు నిర్మాణానికి వస్తారని ముందుగానే తెలిసినప్పటికీ అటవీ శాఖ డీఆర్వో సమీపంలోని అటవీ సిబ్బందిని గస్తీకి తీసుకురాలేదు. అక్రమంగా రోడ్డు నిర్మిస్తున్నారని ఉన్నతాధికారులకు చెప్పినా వారి నుంచి స్పందన రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అటవీ శాఖ, పోలీసు శాఖల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల కొల్లేరులో పలు ఘటనలు వివాదాస్పదమయ్యాయన్నది అందరికీ తెలిసిందే.
 
చింతమనేని కేసులో అదనపు సెక్షన్లు

కైకలూరు : అటవీశాఖ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించి అభయారణ్య పరిధిలో రోడ్డు వేయడంపై అటవీ శాఖ డీఆర్వో జి.ఈశ్వరరావు ఫిర్యాదు మేర కు వన్యప్రాణి అభయారణ్య చట్టం 1972 ప్రకారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై  సెక్షన్ 27, 29, 51 ప్రకారం శనివారం కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ కేసులో వైల్డ్ లైఫ్ యాక్టులోని 151, 152, 441, 353 వంటి క్రిమినల్ సెక్షన్లను అదనంగా ఆదివారం చేర్చినట్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజేశ్ తెలిపారు. విధుల్లో ఉన్న ఉద్యోగిని నిర్బంధించడం, దౌర్జన్యంగా వాహనాలను తీసుకువెళ్లడం వంటి నేరాలు  ఈ సెక్షన్ల కిందికి వస్తాయని  చెప్పారు.
 
 చింతమనేనిని అరెస్టు చేయాలి
 విధి నిర్వహణలో ఉన్న అటవీ సిబ్బందిపై దౌర్జన్యం చేయించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై విచారణ జరిపి అరెస్టు చేయాలి. ఆయన గతంలోనూ అటవీ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించి కొల్లేరులో అక్రమంగా రోడ్డు వేయించడమే కాకుండా అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఎమ్మెల్యేపై కేసు నమోదుచేయాల్సిందే.
     - జె.వి.సుబ్బారెడ్డి, ఏపీ అటవీ శాఖ రేంజ్ అధికారుల సంఘం అధ్యక్షుడు
 
 

మరిన్ని వార్తలు