నో ఎక్స్‌ట్రా చార్జ్

27 Jan, 2015 02:04 IST|Sakshi
నో ఎక్స్‌ట్రా చార్జ్

ప్రొద్దుటూరు: ఆర్టీసీ ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే తమ టికెట్లు రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు కూడా డబ్బు తిరిగి చెల్లిస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచి ఈ వ్యవహారం జిల్లాలోని అన్ని డిపోల్లో జరుగుతోంది. సాధారణంగా ఆర్టీసీ అధికారులు ఉన్న సర్వీసులకు మినహా కొత్తగా ఒక్క సర్వీసును ఏర్పాటు చేసినా ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేసే విధానాన్ని అనవాయితీగా పెట్టుకున్నారు.

టికెట్లను బట్టి స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేస్తుంటారు.  నిబంధనలకు విరుద్ధంగా దూర ప్రాంతాలకు సైతం సూపర్ లగ్జరీ స్థానంలో డీలక్స్ బస్సులను  ఏర్పాటు చేస్తున్నారు.  హైదరాబాద్‌కు ప్రొద్దుటూరు నుంచి రూ.300 టికెట్ ఉంటే స్పెషల్ సర్వీసు పేరుతో  రూ.450 వసూలు చేస్తున్నారు. సీజన్, అన్ సీజన్ లేకపోయినా కొత్త సర్వీసు ఏర్పాటు చేస్తే ఈ విధంగా చార్జీలను వసూలు  చేస్తుంటారు.   

అయితే  ఇక నుంచి ప్రత్యేక సందర్భాలు (పండుగలు, ఉత్సవాలు) మినహా సాధారణ రోజుల్లో అదనపు చార్జీలు వసూలు చేయొద్దని ఆర్టీసీ అధికారులకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే డబ్బు చెల్లించిన ప్రయాణికులకు వెంటనే తిరిగి చెల్లించాల్సిందిగా కోరారు. దీంతో సోమవారం రాత్రి నుంచే అన్ని డిపోల్లో స్పెషల్ సర్వీసులకు సంబంధించిన అదనపు డబ్బును ప్రయాణికులకు తిరిగి చెల్లించడం మొదలైంది. ఆర్టీసీ అధికారులను ఈ విషయంపై న్యూస్‌లైన్ వివరణ కోరగా ఇది కొత్త నిబంధన ఏమీ  కాదని తొలి నుంచి ఉన్నదేనన్నారు.
 
పండుగ వేళల్లో మినహా సాధారణ రోజుల్లో అదనపు చార్జీలు వసూలు చేయొద్దన్నారు. ఒక్క ప్రొద్దుటూరులోనే ఇప్పటికే 10 స్పెషల్ సర్వీసులకు సంబంధించిన సీట్లు రిజర్వ్ కావడం గమనార్హం. ఇలా జిల్లాలోని అన్ని డిపోల్లో స్పెషల్ సర్వీసులు ఏర్పాటు కాగా వారందరికి ఆర్టీసీ యాజమాన్యం డబ్బు తిరిగి చెల్లిస్తోంది.

మరిన్ని వార్తలు