ఎన్నాళ్లీ వెతలు

28 Jan, 2014 03:09 IST|Sakshi

 ఎదుగూ బొదుగూ లేని పారిశుధ్య కార్మికులు
 దారిద్య్రం తాండవిస్తున్నా కనికరింపు లేదు
 కాంట్రాక్టు సంగతి సరే...
 కనీసం పర్మినెంట్ వారికీ దిక్కులేదు
 మహిళా కార్మికుల అవస్థలు
 మరింత వర్ణనాతీతం
 
 ఊరు నిద్ర లేవకముందే...తట్టా, చీపురు చేతపట్టి వీధుల్లోకొచ్చి వెలుగు రేఖలు విచ్చుకునే సరికల్లా అడుగడుగూ శుభ్రపరిచే పారిశుధ్య కార్మికుల జీవితాలు దుర్భరంగా ఉంటున్నాయి. మహిళా కార్మికుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఒక వారం రోజులపాటు వారంతా విధులకు స్వస్తి చెప్తే తెలుస్తుంది వారి ప్రాధాన్యత ఎంతో. నగరపాలక సంస్థ, నగర పంచాయతీలు, పంచాయతీలు ఏవైనా సరే పారిశుధ్య కార్మికులు అత్యంత అవసరం. జిల్లాలోని మహిళా పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ‘న్యూస్‌లైన్’ బృందం సోమవారం పరిశీలించగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి.                          - న్యూస్‌లైన్, ఒంగోలు
 
 ఒంగోలు నగరంతో పాటు, చీరాల, మార్కాపురం, కందుకూరు మున్సిపాలిటీలు, అద్దంకి, గిద్దలూరు, కనిగిరి, చీమకుర్తి నగర పంచాయతీలు, 55 మేజర్ పంచాయతీలు, మరికొన్ని మైనర్ పంచాయతీల్లోనూ పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కో పంచాయతీలో ఒక్కో రకంగా జీతాలు చెల్లిస్తున్నారు. పొన్నలూరులో నెలకు రూ.3 వేలు, సింగరాయకొండలో రూ.5,100, టంగుటూరులో రూ.6 వేలు ఇలా..ఇష్టారీతిగా జీతాలిస్తున్నారు. నగర పాలక, పురపాలక సంఘాల్లో ఉన్నవారిలో దాదాపు 70 శాతం మంది కాంట్రాక్టు కార్మికులుండగా అందులోనూ 40 శాతం మంది మహిళా కార్మికులు కావడంతో వారి సంక్షేమం తమకు పట్టదన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు.
 
 పారిశుధ్య కార్మికులకు తప్పనిసరిగా ఏడాదికి రెండు జతల యూనిఫాంలు, కొబ్బరినూనె, సబ్బులు, 2 జతల చెప్పులు ఇవ్వాలి. అయితే ఒంగోలు, చీరాల మినహా ఎక్కడా 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి పంపిణీ చేయలేదు. పారిశుధ్య కార్మికుల చేతులకు గ్లౌజులు కూడా పంపిణీ చేయడం లేదు. ఒంగోలు, చీరాల వంటి చోట్ల అర్ధరాత్రిళ్లు సైతం వారిని విధులకు పిలుస్తున్నారు. ఆ సమయంలో వారి అవస్థలు వర్ణనాతీతం. రాత్రిపూట, వేకువజామున రద్దీ ప్రాంతాల్లో విధులు నిర్వహించే పారిశుధ్య కార్మికులకు రేడియం జాకెట్లు పంపిణీ చేయాలి. ఒంగోలులోనే కొందరికి లేవు.
 
 మున్సిపల్ శాఖామంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కందుకూరు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు కనీసం తట్టలు, బుట్టలు సైతం లేకపోవడం గమనార్హం. దుస్తులు, చెప్పులు, బూట్లు పర్మినెంట్ కార్మికులకు ఇస్తుండగా కాంట్రాక్టు కార్మికులకు అవీ లేవు. జీతాల విషయంలోనూ తేడాలు చూపుతున్నారు. కాంట్రాక్టు కార్మికులకు నెలకు రూ.6,750 ఇస్తున్నారు. అయితే వాటిలో ఈఎస్సై, పీఎఫ్ కట్ చేస్తుండటంతో చేతికొచ్చేది రూ.5 వేలు మాత్రమే. అది కూడా చాలా చోట్ల సక్రమంగా ఇవ్వడం లేదు. టంగుటూరు పంచాయతీలో 5 నెలల జీతం పెండింగ్‌లో ఉండిపోయింది. ఒంగోలు నగరపాలక సంస్థలో పంచాయతీలను విలీనం చేసే క్రమంలో పారిశుధ్య కార్మికులకు రెండు నెలల జీతాలు ఆగిపోయాయి.
 
 అందని వైద్యసేవలు:
 నిత్యం దుమ్ముధూళిలో, అపరిశుభ్రత నడుమ పనిచేసే పారిశుధ్య కార్మికులు ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వారికి కనీసం వైద్యసేవలు అందడం లేదు. జిల్లాలో ఈఎస్సై ఆస్పత్రి లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఈఎస్సై సేవలు పొందేందుకు ప్రతినెలా జీతంలో కోత పడుతున్నా ప్రైవేటు, ప్రభుత్వ వైద్యశాలలను ఆశ్రయించక తప్పడం లేదు. తమకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని మహిళా పారిశుధ్య కార్మికులు కోరుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుధ్య కార్మికులను పెంచాలని కోరుతున్నారు. ఇక పంచాయతీ ఉద్యోగులకు కూడా 010 హెడ్ కింద జీతాలు వారి అకౌంట్‌లో పడకపోవడం, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.8750 ఇవ్వాలని జీవో ఉన్నా ప్రభుత్వమే అమలు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 ఈఎస్సై ఆస్పత్రి అవసరం :
 ధనలక్ష్మి, ఒంగోలు
 ఈఎస్సై పేరుతో ప్రతినెలా జీతాల నుంచి కోతపడుతోంది. కానీ విజయవాడలాంటి ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందాలంటే కుదిరేపనికాదు. ఒంగోలులో ఈఎస్సై ఆస్పత్రిని ప్రభుత్వం మంజూరు చేయాలి. అప్పటి వరకు కనీసం చిన్న డిస్పెన్సరీని అయినా ఏర్పాటు చేయాలి. అలా చేస్తే మాకు ఉపయోగం ఉంటుంది.  
 
 మా గురించి ఎవ్వరూ
 ఆలోచించడం లేదు
 పోట్లూరి సుబ్బులు, వలపర్ల.
 పారిశుధ్య కార్మికుల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పని ఎక్కువగా ఉంటుంది. వచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు.
 
 నెలకు రూ.100 నుంచి పనిచేశాను:
 మేకల అంజమ్మ, తాళ్లూరు
 30 ఏళ్ల నుంచి తాళ్లూరు పంచాయతీలో రోడ్డు చిమ్ముతున్నారు. నెలకు వంద రూపాయల నుంచి పనిచేశాను. ప్రస్తుతం వెయ్యి రూపాయలిస్తున్నారు. ఉదయం మూడు గంటలకు రోడ్లు చిమ్ముతాను. మళ్లీ 9 గంటల నుంచి ఆఫీస్ పనిచేస్తాను. అందుకుగాను రూ.500 ఇస్తారు. అరకొర జీతంతో అవస్థ పడుతున్నా.
 
 నాలుగు నెలల జీతాలు
 రావాలి : మంచాల అంకాళమ్మ,
 యర్రగొండపాలెం
 మాకు నాలుగు నెలల జీతాలు రావాలి. జీతాలు రాక పోవడంతో కిరాణా కొట్లో అప్పు  కూడా ఇవ్వమంటున్నారు. రోజు కూలీ పైనే ఆధారపడి ఉన్నాం. మా జీతాలు సక్రమంగా వచ్చేలా చూడాలి.
 

మరిన్ని వార్తలు