రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపం

25 May, 2018 08:40 IST|Sakshi

జూన్‌ 2న బెంజిసర్కిల్లో నవ నిర్మాణ దీక్ష

8వ తేదీ వరకు రోజుకో అంశంపై వేడుకలు

సీఎం చంద్రబాబు వెల్లడి

సాక్షి, అమరావతి : రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఈ నేపథ్యంలో దానిని జరుపుకోవడం సమంజసం కాదని ఆయన చెప్పారు. నవ నిర్మాణదీక్ష–2018పై సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. నాలుగేళ్లు గడిచినా రాష్ట్రానికి న్యాయం జరగలేదని ఆయనన్నారు. ఈసారి కూడా జూన్‌ 2వ తేదీ ఉదయం విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ దగ్గరే నవ నిర్మాణ దీక్ష నిర్వహించనున్నామని, అక్కడే తాను దీక్ష ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నాలుగేళ్లలో తాము సాధించిన అభివృద్ధిని ప్రజలకు అంకితం చేస్తామన్నారు.

కాగా, విభజన జరిగి నాలుగేళ్లయినా ఇంకా తలసరి ఆదాయంలో తెలంగాణ కంటే రూ.32 వేలు వెనుకబడే వున్నామని, దీనిని అధిగమించాలంటే మరో ఎనిమిదేళ్ల సమయం పడుతుందన్నారు. ఇదిలా ఉంటే.. ఒక్కోరోజు ఒక్కో జిల్లాలో ముఖ్యమంత్రి సమక్షంలో కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. 8వ తేదీ వరకు జరిగే నవ నిర్మాణ దీక్షల సందర్భంగా 12 వేల గ్రామాల్లోను ప్రతీ రోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాలు రెండో రోజు నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నారు. గ్రామాల్లో ఒక్కోరోజు ఒక్కో అంశంపై వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు.

నవ నిర్మాణదీక్ష కార్యక్రమాల వివరాలు: 

  • 02.06.18: నవ నిర్మాణ దీక్ష (విభజన చట్టం అమలు తీరు)
  • 03.06.18: నీటి భద్రత, కరువు రహిత రాష్ట్రం (తాగునీరు, పారిశ్రామిక నీరు, పోలవరం, ప్రాధాన్య ప్రాజెక్టులు , జలవనరులు)
  • 04.06.18: రైతు సంక్షేమం, ఆహార భద్రత (వ్యవసాయ, అనుబంధ రంగాలు, పౌర సరఫరాలు)
  • 05.06.18: సంక్షేమం సాధికారత (వైద్య ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమం, సమాజ వికాసం, కుటుంబ వికాసం)
  • 06.06.18: ఉపాధి కల్పన జ్ఞానభూమి (పారిశ్రామికం, సేవారంగం, మానవ వనరులు, విద్య, నైపుణ్యాభివృద్ధి)
  •  07.06.18: మౌలిక సదుపాయాలు మెరుగైన జీవనం (అమరావతి, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి)
  • 08.06.18: మహా సంకల్పం (సుపరిపాలన అవినీతి రహిత సుపరిపాలన, గ్రామ, రాష్ట్ర స్థాయిలో యాక్షన్‌ ప్లాన్, ఇ–ప్రగతి, ఐటీ, ఐవోటీ, పౌర సేవలు, సుస్థిర వృద్ధి, విజన్‌).
మరిన్ని వార్తలు