ఎరువు దొరక్క సిద్దిపేటలో రాస్తారోకో

6 Aug, 2013 00:17 IST|Sakshi

యూరియా కొరత రైతన్నలను తీవ్రం వేధిస్తోంది.  వారం రోజులుగా వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రైతులకు కావాల్సిన ఎరువు మాత్రం దొరకడం లేదు. రోజూ పొద్దునే పొలం పనులు మాని మండల కేంద్రానికి వస్తున్న రైతులు రాత్రిదాకా వేచి చూసి అధికారుల రేపు, మాపు మాటలతో ఉసూరుమంటూ ఇంటిదారి పడుతున్నాడు. సోమవారం కూడా సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో గల ఎరువుల దుకాణం ఎదుట బారులు తీరారు. అయితే యూరియా రాలేదని తెలుసుకున్న రైతులు కరీంనగర్ రోడ్డుపై బైఠాయించారు. మంగళవారం అమావాస్య ఉందనీ, బుధవారం వరకు యూరియా కోసం రైతులు వేచి చూడాలని వ్యవసాయ అధికారులు రైతులకు చెప్పడంతో వారు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతి సంవత్సరం తమకీ తిప్పలు తప్పడం లేదంటూ శాపనార్ధాలు పెట్టారు. గంటపాటు జరిగిన రాస్తారోకోతో కరీంనగర్ రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని రైతులను శాంతింప చేసేందుకు ప్రయత్నించారు. స్పష్టమైన హామి ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని రైతులు తేల్చిచెప్పడంతో అప్పటికప్పుడు పోలీసులు వ్యవసాయాధికారులతో మాట్లాడారు. అనంతరం బుధవారం యూరియా పంపిణీ చేసేందుకు అధికారులు టోకెన్లు ఇస్తామని చెప్పారని రైతులకు తెలపడంతో వారు శాంతించారు. అనంతరం అందరూ వెళ్లి యూరియా కోసం టోకెన్లు తీసుకున్నారు.
 
 మెదక్‌లో చంటిపిల్లలతో బారులు
 ఇక మెదక్ మండలంలోనూ యూరియా కష్టాలు తీవ్రమయ్యాయి. సకాలంలో పంటలకు యూరియా వేసేందుకు మహిళా రైతులు సైతం చంటిబిడ్డలను ఎత్తుకుని బారులు తీరుతున్నారు. సోమవారం పీఏసీఎస్ పరిధిలోని ఆయా గ్రామాల రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద యూరియా కోసం బారులు తీరారు. ఒక్కో పాస్‌బుక్కుపై రెండేసి బస్తాలు మాత్రమే ఇవ్వడంతో కుటుంబీకులను క్యూ కట్టించారు. అయినప్పటికీ దొరక్కపోవడంతో కొందరు ఇంటిదారిపట్టారు. పొలంపనులు మానుకుని యూరియాకోసం వస్తే ఇలా రోజుల తరబడి తిప్పించుకోవడం అన్యాయమని పలువురు రైతులు అంటున్నారు.

మరిన్ని వార్తలు