కట్నం చాలదని పెళ్లికి నిరాకరణ

25 Feb, 2015 01:36 IST|Sakshi

పోలీసులను ఆశ్రయించిన  బాధితులు
పెళ్లికొడుకు ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగి
వివాహం మార్చి 6న

 
నక్కపల్లి: నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన గట్టెం సూరిబాబు కుమార్తెకు తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కొలిమేరుకు చెందిన పేకేటి సూర్యరామకృష్ణతో వివాహం నిశ్చయమైంది. పెళ్లికొడుకు రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నాడు. ఇరువురి తల్లిదండ్రులు, పెద్దమనుషుల సమక్షంలో పెళ్లిమాటలు జరిగాయి. కట్నకానుకల రూపంలో వరుడికి 1.50ఎకరాల భూమి,15తులాల బంగారం, ఆడపడుచు కట్నం కింద రూ.2 లక్షలతోపాటు పట్టుచీర, సారెలు తదితర లాంఛనాల నిమిత్తం మరో రూ.80వేలు ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఈనెల7న పసుపువాయి(నిశ్చితార్థం) కూడా జరిగింది. మార్చి7న పెళ్లికి   ముహూర్తం పెట్టారు. ఈమేరకు ఆడపడుచు కట్నం, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.2.80లక్షలు పెళ్లికొడుకు తల్లి, అతని సోదరునికి   ఈ నెల 8న ఇచ్చామని సూరిబాబు తెలిపాడు. ఈనెల 18న పెళ్లికొడుకు రామకృష్ణ, పెళ్లికుమార్తె తండ్రికి ఫోన్‌చేసి కట్నం చాలదని 3 ఎకరాల భూమి, 20తులాల బంగారం, పాయకరావుపేట పట్టణంలో ఇంటిస్థలం కొనివ్వాలని డిమాండ్ చేశాడు.

ఈనెల 21న పెళ్లికొడుకు తల్లిదండ్రులు కూడా ఫోన్‌లో ఇదే విషయం తెలిపారని, తాము అడిగినంత ఇస్తే తప్ప వివాహానికి అంగీకరించేది లేదని వేరే సంబంధం చూసుకుంటామని స్పష్టం చేశారన్నారు. పెళ్లి ఆగిపోతే అబాసుపాలవుతామన్న బెంగతో రెండెకరాలభూమి, 20తులాల బంగారం ఇస్తామని అంతకంటే స్తోమతలేదని, బంధువులకు శుభలేఖలు పంచుకున్నామని, అందరికీ అడ్వాన్సులు కూడా ఇచ్చామంటూ వియ్యాలవారి కాళ్లావేళ్లా బతిమాలినా ఒప్పుకోలేదని తెలిపారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయానికి, తమకుటుంబానికి జరిగిన పరాభవానికి కారకులైనవారిపై కేసు నమెదు చేయాలంటూ ఫిర్యాదు చేశామన్నారు. జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఇదే విషయాన్ని ఎస్‌ఐ విజయ్‌కుమార్ వద్ద ప్రస్తావించగా ఫిర్యాదు అందిందని, పరిశీలిస్తున్నామన్నారు.
 
 

>
మరిన్ని వార్తలు