కన్నకూతురిని కత్తులతో నరికి..

11 Nov, 2023 03:13 IST|Sakshi

గర్భిణి అని కూడా చూడకుండా ఓ నాన్న ఘాతుకం..

సహకరించిన సోదరులు

ఆస్తి కోసం దారుణం 

కత్తులు, గొడ్డలితో కూతురు, అల్లుడిపై దాడి 

పారిపోతున్న కూతురిని వెంబడించి మరీ.. 

అక్కడికక్కడే కుమార్తె మృతి, అల్లుడి పరిస్థితి విషమం 

ఖమ్మం జిల్లా తాటిపూడి గ్రామంలో ఘటన 

వైరా రూరల్‌: ఆస్తి కోసం కనీస విచక్షణ, మానవత్వం..చివరికి కన్నప్రేమను కూడా మరిచి మృగంలా మారిన ఓ తండ్రి కన్నకూతురును.. పైగా ఐదు నెలల గర్భవతి అని కూడా చూడ కుండా వేటకొడవళ్లు, గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనలో కుమార్తె అక్కడికక్కడే మృతిచెందగా అల్లుడు చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. 

తాటిపూడి గ్రామానికి చెందిన పిట్టల రాములు, మంగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులతోపాటు కుమార్తె ఉషశ్రీ(35) ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమారులు నరేశ్, వెంకటేష్‌ స్థానికంగానే ఉంటుండగా, మరొకరు దూరంగా నివసిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన రాములు మామ (మంగమ్మ తండ్రి) మన్నెం వెంకయ్య చిన్నతనం నుంచే ఉషశ్రీని పెంచి పెద్దచేసి పదేళ్ల కిందట కొణిజర్ల మండలం గోపారానికి చెందిన పర్శబోయిన రామకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు.

ఈ సమయంలో వెంకయ్య తన రెండు ఎకరాల వ్యవసాయ భూమి, 10కుంటల ఇంటి స్థలాన్ని ఉషశ్రీ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో రామకృష్ణ ఇల్లరికంపై తాటిపూడికి రాగా, అక్కడే భార్యాభర్తలు టైలరింగ్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పదేళ్ల క్రితం పెళ్లి కాగా, ఇన్నేళ్లకు ఉషశ్రీ గర్భం దాల్చింది. కాగా, తన మామ వెంకయ్య ఆస్తిని ఉషశ్రీకి రాయడాన్ని జీర్ణించుకోలేని ఆమె తండ్రి రాములు, సోదరులు నరేశ్, వెంకటేష్‌ తరచూ ఘర్షణ పడేవారు. ఈ విషయమై కేసు కూడా కోర్టులో పెండింగ్‌లో ఉంది. 

కూతురినీ నరికేశాడు.. 
శుక్రవారం ఉదయం ఉషశ్రీకి చెందిన ఇంటి స్థలంలో ఉన్న సుబాబుల్‌ చెట్లను నరికేందుకు పిట్టల రాములు, ఆయన కుమారులు నరేష్, వెంకటేశ్‌ వేటకొడవళ్లు, గొడ్డలి, గడ్డపలుగులతో వచ్చారు. ఇది చూసి రామకృష్ణ, ఉషశ్రీ అడ్డుకున్నారు. దీంతో వారు గడ్డపలుగు, వేటకొడవళ్లతో వెంటపడ్డారు. ఈ క్రమంలో రామకృష్ణపై దాడి చేస్తుండగా, ఉషశ్రీ తప్పించుకునే ప్రయత్నంలో ఇంకొకరి ఇంట్లోకి వెళ్లడంతో వెంబడించి మరీ నరికారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

తీవ్రగాయాలపాలైన రామకృష్ణను స్థానికులు 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మరక్షణ కోసం ఉషశ్రీ, రామకృష్ణ ప్రతిదాడి చేయడంతో రాములు, వెంకటేశ్, నరేశ్‌కు కూడా గాయాలవడంతో ఆస్పత్రిలో చేరారు. వైరా ఏసీపీ ఎం.ఎ రెహమాన్, సీఐ నునావత్‌ సాగర్, ఎస్సై మేడా ప్రసాద్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు