వారంతా 'సేఫ్‌'

23 Apr, 2020 04:36 IST|Sakshi
సుధీర్‌ ఆరోగ్య వివరాలు సేకరిస్తున్న ఏఎన్‌ఎంలు

కోలుకున్న ఎన్‌ఆర్‌ఐలు

లండన్‌ నుంచి రాజమహేంద్రవరం వచ్చిన 23 ఏళ్ల యువకుడికి కరోనా పరీక్ష చేయగా.. పాజిటివ్‌ వచ్చింది. హుటాహుటిన కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రత్యేక వైద్యులతో కూడిన బృందం ఆధ్వర్యంలో కార్పొరేట్‌ తరహా వైద్య సేవలందించడంతో ఆ యువకుడు 13 రోజుల్లోనే కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వెళ్లాడు. తూర్పు గోదావరి జిల్లాలో తొలి పాజిటివ్‌ తొలి కేసుగా నమోదైన ఆ యువకుడు కరోనాను జయించాడు. వైద్యులు, అధికారులు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. ఇలా పాజిటివ్‌ కేసులే కాదు.. నెగిటివ్‌ వచ్చిన వారిని కూడా హోం క్వారంటైన్‌లో ఉంచి కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కట్టడి చేసింది. 

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: విదేశాల నుంచి వచ్చిన వారంతా కరోనా మహమ్మారి నుంచి సేఫ్‌గా బయటపడ్డారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఇచ్చిన సమాచారం ఆధారంగా విదేశాల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులు ఎక్కడెక్కడ ఉన్నార నేది రాష్ట్ర ప్రభుత్వం జల్లెడ పట్టింది. పట్టణాలు, గ్రామాల్లో వలంటీర్ల సాయంతో ఇంటింటా సర్వే నిర్వహించి ఎన్‌ఆర్‌ఐల చిరునామాలను గుర్తిం చారు. వారందరినీ ఆస్పత్రి క్వారంటైన్, హోం క్వారంటైన్లకు తరలించారు. వారంతా సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడి సంతోషంగా ఉన్నారు. తమ ద్వారా రాష్ట్రానికి కరోనా వస్తుందనే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మొదట భయపడినా.. ప్రభుత్వం అందించిన వైద్యంతో  క్షేమంగా బయట పడ్డామని ఎన్‌ఆర్‌ఐలు చెబుతున్నారు.

తూర్పు గోదావరిలో 2,407 మంది
► వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఎన్‌ఆర్‌ఐకి వైద్య పరీక్షలు చేయించగా.. వారిలో 13 మందికి పాజిటివ్‌ వచ్చింది. 
► ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే ప్రవాస భారతీయులు 2,407 మంది ఉన్నారు. వీరితోపాటు వారి రక్త సంబంధీకులు, బంధువులు మరో 9 వేల మందిపైనే ఉన్నారు. 

అంతా క్షేమం
రాష్ట్ర ప్రభుత్వం అందించిన జాబితా ఆధారంగా ఎన్‌ఆర్‌ఐ లందరినీ హోం క్వారంటైన్లలో ఉంచాం. రాజమహేంద్రవరానికి చెందిన లండన్‌ యువకుడికి పాజిటివ్‌ వచ్చిన ప్పుడు చాలా కంగారుపడ్డాం. కాకినాడ జీజీహెచ్‌ వైద్యుల బృందం చొరవ తీసుకుని ప్రత్యేక వైద్యం అందించడంతో అతడికి నెగిటివ్‌ వచ్చింది. ఇది చాలా సంతోషమనిపించింది. హోం క్వారంటైన్‌లో ఉన్న వారిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. 
– డి.మురళీధర్‌ రెడ్డి, కలెక్టర్, తూర్పు గోదావరి

చాలా బాగా చూసుకున్నారు 
దుబాయ్‌లో ఉంటూ మార్చి 19న స్వగ్రామానికి వచ్చాను. వైద్యుల సలహాతో హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నాను. ఆ సమయంలో సఖినేటిపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ పావని పర్యవేక్షణలో సిబ్బంది, ఏఎన్‌ఎంలు ఎన్‌.నీలిమ, వి.మణికుమారి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. 28 రోజులు హోమ్‌ ఐసోలేషన్‌ పాటించాను. టెస్టుల్లో నెగిటివ్‌ రావడంతో నేను, నా కుటుంబ సభ్యులు పూర్తి సేఫ్‌ జోన్‌లో ఉన్నాం. వైద్య సిబ్బందికి ఎంతో రుణపడి ఉంటా. 
– కారుపల్లి సుధీర్, ఎన్నారై, సఖినేటిపల్లిలంక

ప్రభుత్వ కృషి ప్రశంసనీయం 
మా కుమార్తె న్యూజిలాండ్‌లో స్థిరపడింది. నేను, నా భార్య ఆమె వద్దకు వెళ్లి ఆరు నెలలు ఉన్నాం. మార్చి 11న స్వగ్రామానికి చేరుకున్నాం. ఆ తరువాత మా ఇంటికి వలంటీర్, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ మహిళా పోలీస్‌ వచ్చారు. వివరాలు నమోదు చేసుకుని హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలన్నారు.  మాకు భయమేసింది. ఈ 28 రోజుల్లో సొంత బంధువుల కంటే ఎక్కువగా మమ్మల్ని చూసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి చేసిన కృషి ప్రశంసనీయం.
– మామిడిశెట్టి సత్యప్రసాద్, సంధ్యాకుమారి దంపతులు, వాకలపూడి, కాకినాడ రూరల్‌  

>
మరిన్ని వార్తలు