భద్రత గాలిలోకి.. నిఘా నిద్రలోకి

19 Feb, 2015 03:11 IST|Sakshi

క్రైం( కడప అర్బన్): జిల్లాలో ప్రజలు ఎక్కడికైనా పనిమీద వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇళ్లకు తాళాలు భద్రంగా వేసినా దొంగ లు ఎంచక్కా వాటిని బద్దలు కొట్టి దర్జాగా దోపిడీలకు పాల్పడుతున్నారు. కనీసం దైవ దర్శనాలకు, బంధువుల వేడుకలకు వెళ్లాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచించి వెళ్లాల్సి వస్తోంది. తాళాలు వేసిన ఇళ్లు పదిలంగా ఉంటాయన్న గ్యారెంటీ లేకుండా పోతోంది.
 
 పోలీసు కానిస్టేబుల్ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయి వరకు రాత్రి వేళల్లో గస్తీ తిరుగుతున్నట్లు కనిపిస్తున్నా దొంగలు మాత్రం తమపని ముగించేస్తున్నారు. గత మూడేళ్లలో దోపిడీలు, పగటిపూట దొంగతనాలు తగ్గినా రాత్రి వేళల్లో మాత్రం దొంగలు చెలరేగిపోతున్నారు. పగలు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఈ సంఘటనలు చూస్తుంటే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారా మొద్దు నిద్రలో ఉన్నారా అనే అనుమానం కలుగుతోందని పలువురు విమర్శిస్తున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని దొంగతనాల వివరాలు ఇలా ఉన్నాయి...
 
 కడప నగరంలోని వైవీ స్ట్రీట్‌లో నివసిస్తున్న ఫర్నీచర్  వ్యాపారి శ్రీరాములు ఈ నెల 8న తన కుటుంబంతో కలిసి దైవదర్శనం కోసం తిరుమలకు వెళ్లగా అదే రోజు రాత్రి ఆ ఇంటి తాళాలు పగులగొట్టి దాదాపు రూ. 2 లక్షల 80 వేలు నగదు, 8 తులాల బంగారు ఆభరణాలు, దోచుకెళ్లారు. అదే రోజు కో ఆపరేటివ్ కాలనీ సమీపంలో ఇన్నోవా వాహ నానికి సంబంధించిన టైర్లను దొంగిలించారు.
 
 ఎర్రగుంట్లలోని జువారి కాలనీలో ఏడు ఇళ్లను దొంగలు కొల్లగొట్టారు. ఈ సంఘటన ఈ నెల 6న జరిగింది. మొత్తం 80 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి దోచుకెళ్లారు.
 ఈ నెల 4వ తేదీన ప్రొద్దుటూరు శ్రీరాములపేటలోని ఓ ఇంటి తాళం పగులగొట్టి 17 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి దొంగిలించారు.
 ఈ నెల 2న ప్రొద్దుటూరులోని ఓ ఇంట్లో దొంగలు చొరబడి 40 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.
 

మరిన్ని వార్తలు