‘అధికార పార్టీ తొత్తులైన అధికారులు’

1 Jul, 2017 21:50 IST|Sakshi
‘అధికార పార్టీ తొత్తులైన అధికారులు’

పీలేరు: పార్టీలకతీతంగా విధులు నిర్వర్తించాల్సిన అధికారులు  బరితెగింపుతో అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీపై ప్రత్యేక మక్కువ ఉన్న అధికారులు నేరుగా ఆ పార్టీలో చేరితే తమకు అభ్యంతరం లేదని కొంతమంది అధికారుల  తీరు దుర్మార్గమని అన్నారు. పలుమార్లు హెచ్చరించినా పలువురు అధికారులు తమ తీరు మార్చుకోకపోవడం శోచనీయమన్నారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద నెలవారీ ఆస్తుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ప్రత్యేకాధికారి అధ్యక్షతన ఆరు మండలాలకు చెందిన అన్ని శాఖల అధికారులతో ఈ కార్యక్రమం జరిగింది. అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులు ఎమ్మెల్యే సమావేశానికి హాజరు కాకుండానే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఎమ్మెల్యే వచ్చేసరికి స్టేజిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉండడాన్ని చూసి ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేక టీడీపీ సమావేశమా అని అధికారులను ప్రశ్నించారు. ఏ అధికారం ఉందని  టీడీపీ నేతలను స్టేజిపైకి ఆహ్వానించి అసలైన ప్రజాప్రతినిధులను ఎందుకు విస్మరించారని నిలదీశారు. ఎమ్మెల్యే రావటం గమనించిన అధికారులు స్టేజిపైకి రావాలిన మైక్‌లో పిలిచారు.
దీనికి స్పందించిన రామచంద్రారెడ్డి కనీసం ప్రొటోకాల్ పాటించాలన్న ఇంగిత జ్ఞానం లేనపుడు తాను పైకి రానని జనంలోనే కూర్చుంటానంటూ పక్కన ఉన్న కూర్చీలో పార్టీ ఎంపీపీలు, జెడ్పీటీసీలతో కలిసి  కూర్చున్నారు. ఎమ్మెల్యేను విస్మరించి టీడీపీ కార్యక్రమం తరహాలో కొనసాగించారు.

ఇంతలో లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేసే సమయంలో ఎమ్మెల్యే పేరు ప్రస్తావించగా ప్రొటోకాల్‌ పాటించని అధికారుల వైఖరికి నిరసనగా కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఇంతలో టీడీపీ నేతలు కేరింతలు, బిగ్గరగా కేకలు వేయడంతో ఎమ్మెల్యే అనుచరులు అధికారులను నిలదీశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలను ఎందుకు ఆహ్వానించలేదని, వారు వస్తే ఎక్కడ కూర్చోవాలో చూపాలంటూ అధికారులను నిలదీశారు. టీడీపీ నేతల కేకలకు నిరసనగా ఎమ్మెల్యే ఎంపీడీవో కార్యాలయం ప్రవేశ గేటు వద్ద నేలపై గంటకుపైగా బైఠాయించారు. ఎమ్మెల్యే ధర్నాకు కూర్చున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం టీడీపీ నేతల సూచనల మేరకు కార్యక్రమాన్ని ముగించారు.

పీలేరు అర్బన్, రూరల్‌ సీఐలు డీ. నాగరాజు, మహేశ్వర్, ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి ఇతర పోలీస్‌ అధికారులు ధర్నా వద్దకు చేరుకొని శాంతి భద్రతలను పర్యవేక్షించారు. కార్యక్రమం అనంతం నియోజక వర్గ ప్రత్యేకాధికారి గోపీచంద్, పీలేరు ఎంపీడీవో, తహశీల్దార్‌ ఏ. వసుంధర, మునిప్రకాశంలు సుదీర్గంగా ఎమ్మెల్యేతో చర్చించి ఇలాంటి పొరపాటు భవిష్యత్తులో జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ఇప్పటికే అనేక సార్లు ఇలానే చెప్పా, కనీస మర్యాద కూడా పాటించకుండా వ్యవహరించడం దారుణమన్నారు. పోలీసులు, అధికారుల సూచనల మేరకు ఎమ్మెల్యే ధర్నా విరమించారు.

 

మరిన్ని వార్తలు