అత్యంత గౌరవంగా

11 Sep, 2023 05:08 IST|Sakshi

చంద్రబాబుతో సిట్‌ అధికారులు వ్యవహరించిన తీరు ఇది

ఆయన కోరినట్లే నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో తరలింపు 

కుటుంబ సభ్యులతో భేటీకి అవకాశం 

న్యాయవాదులతో సంప్రదింపులకు అనుమతి 

న్యాయవాది సమక్షంలోనే విచారణ 

అడిగిన ఆహారం, మందులు అందించిన అధికారులు  

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణంలో అరెస్ట్‌ అయిన మాజీ సీఎం చంద్రబాబు పట్ల సీఐడీ సిట్‌ విభాగం అధికారులు ఆద్యంతం అత్యంత గౌరవంగా వ్యవహరించారు. నంద్యాలలో శనివారం ఉదయం 6 గంటలకు అరెస్టు చేసినప్పటి నుంచి ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత జ్యుడీషియల్‌ రిమాండ్‌ కోసం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించేంతవరకు చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్న 73 ఏళ్ల చంద్రబాబు పట్ల సిట్‌ అధికారులు అత్యంత మర్యాద పూర్వకంగా వ్యవహరించారు.   

నిద్ర లేచేవరకు నిరీక్షించి.. 
ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంలో ప్రధాన దోషి అయిన చంద్రబాబును అరెస్ట్‌ చేసేందుకు సిట్‌ ఇన్‌చార్జ్‌ కె.రఘురామిరెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం శనివారం తెల్లవారు జామున 3 గంటలకు నంద్యాల  చేరుకుంది. ఆయన బస చేస్తున్న ఆర్కే ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఉన్న టీడీపీ నేతలకు సమాచారమిచి్చంది. ఆందోళన వ్యక్తం చేసిన వారికి సిట్‌ అధికారులు దర్యాప్తు అంశాలను వివరించి సర్ది చెప్పారు.

అప్పటికి ప్రత్యేక వాహనంలో నిద్రిస్తున్న చంద్రబాబుకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఆయన నిద్ర లేచే వరకు వేచి చూశారు. ఉదయం 5.30 గంటలకు చంద్రబాబు నిద్ర లేచి వాహనం నుంచి బయటకు వచ్చారు. సిట్‌ అధికారులు ఆయన్ని కలిసి కేసు గురించి వివరించారు. ఈ కేసులో అరెస్ట్‌ చేసేందుకు వచ్చామని తెలిపారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంలో తన ప్రమేయం లేదని, తనను ఎందుకు అరెస్ట్‌ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.  తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలను వివరించి అరెస్ట్‌కు సహకరించాలని ఆయన్ను అధికారులు కోరారు. సంబంధిత పత్రాలపై సంతకం తీసుకున్నారు. అనంతరం 6 గంటలకు అరెస్ట్‌ చేసినట్లు  ప్రకటించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్న తరువాతే విజయవాడకు తరలించాలని నిర్ణయించారు.    

కుటుంబ సభ్యులతో గదిలో భేటీ  
శనివారం రాత్రి 7.50 గంటలకు చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, బావమరిది బాలకృష్ణ సిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు అనుమతించాలన్న వారి విజ్ఞప్తిని అధికారులు ఆమోదించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో ఓ గదిలో ప్రత్యేకంగా మాట్లాడుకునేందుకు అవకాశం కలి్పంచారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబును సంప్రదించి ఆయన అడిగిన ఆహారాన్ని అందించారు. అనంతరం తన న్యాయవాదులతో కూడా విడిగా కేసు విషయాలపై బాబు చర్చించారు.  

నిద్రించేందుకు ప్రత్యేక గది 
అనంతరం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు చంద్రబాబును మరోసారి విచారించారు. చంద్రబాబు కోరిన మందులను తెప్పించి ఇచ్చారు. సిట్‌ కార్యాలయంలో ఆయన నిద్రించేందుకు ప్రత్యేక గదిలో తగిన ఏర్పాట్లు చేశారు. అరెస్ట్‌ చేసినప్పటి నుంచి రిమాండ్‌కు తరలించేవరకు చంద్రబాబు  సహాయకుడు మాణిక్యం ఆయన తోనే ఉండేందుకు అధికారులు అనుమతించారు. తమ అదుపులో ఉన్న చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా సిట్‌ అధికారులు ఆద్యంతం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. తమకు సరైన సౌకర్యాలు లేవనిగానీ, అధికారులు సరిగా వ్యవహరించలేదనిగానీ చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఒక్క విమర్శ కూడా చేయకపోవడమే అందుకు నిదర్శనం.  

పటిష్ట భద్రతతో సెంట్రల్‌ జైలుకు.. 
ఆదివారం తెల్లవారుజామున దాదాపు 4 గంటల సమయంలో చంద్రబాబును విజయవాడలోని జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉదయం 5.30 గంటల సమయంలో న్యాయస్థానానికి తరలించారు. సాయంత్రం న్యాయస్థానం జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన తరువాత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించారు. అనంతరం పటిష్ట భద్రతతో ఆయన్ని రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు.   

బాబు పక్కనే దమ్మాలపాటి.. 
తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయానికి చేరుకున్న తరువాత చంద్రబాబు కాసేపు విశ్రమించేందుకు అధికారులు అవకాశం కలి్పంచారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు విచారణ ప్రారంభించారు. తన న్యాయవాదుల పేర్లను ఓ కాగితంపై రాసి వారిని లోపలకు అనుమతించాలని చంద్రబాబు కోరడంతో అందుకు దర్యాప్తు అధికారులు సమ్మతించారు. ఆయన చెప్పిన నలుగురు న్యాయవాదులను కార్యాలయంలోకి అనుమతించారు.

వారితో చంద్రబాబు కాసేపు చర్చించారు. అనంతరం విచారణ ప్రక్రియ ప్రారంభించారు. ఆ సమయంలో కూడా చంద్రబాబు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసరావు ఆయన పక్కనే కూర్చొనేందుకు కూడా సిట్‌ అధికారులు అనుమతించడం గమనార్హం. న్యాయవాది సమక్షంలోనే విచారించారు. విచారణ సందర్భంగా కూడా అధికారులు చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించారు. కేసు దర్యాప్తునకు సంబంధించి ఆయన కోరిన అన్ని పత్రాలను అందించారు. వాటిని ఆయన చదివిన తరువాతే ప్రశ్నలు సంధించారు. 

ఆయన కోరినట్లుగానే.. 
నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో ప్రయాణించడం 73 ఏళ్ల చంద్రబాబుకు ప్రయాస కలిగిస్తుందని సిట్‌ అధికారులు భావించారు. ఆయనకు సౌకర్యవంతంగా ఉండేందుకు హెలికాఫ్టర్‌ను ఏర్పాటు చేసి అదే విషయాన్ని తెలిపారు. అయితే తాను తన వాహనంలోనే రోడ్డు మార్గంలో విజయవాడకు వస్తానని చంద్రబాబు చెప్పడంతో అందుకు సిట్‌ అధికారులు సమ్మతించారు. నంద్యాలలో ఉదయం 8 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయానికి చంద్రబాబును తీసుకొచ్చారు.

మార్గమధ్యంలో కొన్ని చోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయన్ని కలిసేందుకు వేచి ఉన్నారు. చంద్రబాబు కోరిక మేరకు వాహనాన్ని సిట్‌ అధికారులు కొద్దిసేపు నిలిపారు. టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు అభివాదం చేసి కాసేపు మాట్లాడారు. అందుకు సిట్‌ అధికారులు అభ్యంతరం చెప్పకుండా సహకరించారు. చిలకలూరిపేట వద్ద టీడీపీ నేతలు వాహన కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో చంద్రబాబు చెప్పేవరకు నిలిపి ఉంచారు. ఆయన సూచించిన తరువాతే కాన్వాయ్‌ను ముందుకు పోనిచ్చారు.

మరిన్ని వార్తలు