అధికారుల వేధింపులతో మహిళా హోంగార్డు మనస్తాపం

13 Mar, 2019 12:58 IST|Sakshi

న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన  

అనంతపురం సెంట్రల్‌: ఏఆర్‌ విభాగంలో అధికారులు మానసికంగా వేధిస్తున్నారని ఓ మహిళా హోంగార్డు ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం చేయకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని కన్నీటి పర్యంతమవుతోంది. బాధితురాలి కథనం మేరకు... నగరంలో మూడవ పట్టణపోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా హోంగార్డు (పేరు రాయవద్దని బాధితురాలి విజ్ఞప్తి మేరకు) మంగళవారం ఏఆర్‌ అధికారుల తీరును వివరించింది. తనకు ఆరోగ్యం బాగలేదని, చిన్న పిల్లాడు కూడా ఉన్నాడని మొరపెట్టుకుంటున్నా పెడచెవిన పెడుతూ ఇతర విభాగాలకు బదిలీ చేస్తున్నారని వాపోయింది.

ఎవరినీ బదిలీ చేయకుండా తనను మాత్రమే బదిలీ చేశారని, చిన్న పిల్లాడిని వదిలి ఎక్కడికి పోవాలని విలపించింది. ఆర్‌ఐ పెద్దయ్య, హోంగార్డు ఇన్‌చార్జ్‌ ఇక్బాల్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తూ తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించింది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని విషపుద్రావకం తీసుకొచ్చింది. స్థానిక ఉద్యోగులు ఆమెకు సర్ది చెప్పి పంపారు. ఈ విషయంపై ఏఆర్‌ డీఎస్పీ మురళీధర్‌ను వివరణ కోరగా సులభతరమైన విధులకు బదిలీ చేసినా పోనని చెప్పడం ఏమటని ప్రశ్నించారు. ఇది పద్ధతి కాదని, పరిపాలనా పరంగా తీసుకుంటున్న నిర్ణయాలకు సిబ్బంది సహకరించాలని కోరారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలే తప్ప ఇలా చేయరాదని సూచించారు.  

మరిన్ని వార్తలు