వృద్ధాశ్రమాలు, అన్న క్యాంటీన్లు

2 Sep, 2015 01:06 IST|Sakshi
వృద్ధాశ్రమాలు, అన్న క్యాంటీన్లు

 గుంటూరు వెస్ట్ : రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలకు అనుబంధంగా ఎన్‌టీఆర్ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. ఆధునిక వసతులతో ఏర్పాటయ్యే ఈ క్యాంటీన్లలో ఎవరైనా ఆహార పదార్ధాలు తీసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై అక్షయపాత్ర నిర్వాహకుల సూచనలు తీసుకోవాలన్నారు. జెడ్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం సీఆర్‌డీఏ పరిధిలో అమలు చేయాల్సిన సంక్షేమ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. క్యాంటీన్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను సేకరించి వెంటనే నెలకొల్పాలని కోరారు.

వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసేందుకు 60 ఏళ్లకు పైబడి ఉన్నవారి వివరాలను సేకరించాలని కోరారు. భూసేకరణ జరిగిన ప్రాంతాల్లో విద్య, వైద్య సౌకర్యాలపై సమీక్షించిన కలెక్టర్ పేదలకు ఎన్‌టీఆర్ ఆరోగ్యసేవ ద్వారా వైద్యసేవలు అందిస్తున్న మాదిరి ఇతరులకు కూడా వైద్యసేవలు ఉచితంగా అందించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక తయారుచేయాలన్నారు. 5,963 మంది విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్నట్లు సమాచారం ఉందని, వారందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ అందేలా చూడాలని, అవసరమైన వారికి ఉచితంగా విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని డీఈఓను కోరారు. రాజధాని ప్రాంతంలో రోజుకు 5 వేల మందికి రానున్న 120 రోజుల వరకు పనులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ బాలాజీనాయక్‌కు ఆదేశించారు.

 రాజధానిలో కడియం తరహా నర్సరీ
 కడియంలోని నర్సరీ మాదిరి రాజధాని ప్రాంతంలో నర్సరీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీశాఖ అధికారి నాగేశ్వరరావును కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. సమావేశంలో జేసీ చెరుకూరి శ్రీధర్, సీఆర్‌డీఏ అధికారులు చెన్నకేశవులు, ప్రభాకర్‌రెడ్డి, స్పెషల్ కలెక్టర్ రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు.

 రాజధాని ప్రాంతంలో యూనిట్ కార్యాలయాలు
 రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలకు సంబంధించిన వ్యవహారాలను చూసుకునేందుకు వీలుగా ఆ ప్రాంతంలో వివిధ ప్రభుత్వశాఖలు తమ కార్యాలయాల యూనిట్లను నెలకొల్పాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం సీఆర్‌డీఏ పరిధిలో సంక్షేమ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్య, వైద్యం, డీఆర్‌డీఏ, మహిళా శిశుసంక్షేమం, ఫారెస్టు, పోలీసు, డ్వామా తదితర 10 విభాగాల అధికారులు వెంటనే తమ యూనిట్ కార్యాలయాలను రాజధాని ప్రాంతాలలో నెలకొల్పాలని కోరారు.

ఆయా శాఖలు చేపట్టే అభివృద్ధి పనుల నివేదికలను కరపత్రాల రూపంలో ముద్రించి సీఆర్‌డీఏ అధికారులకు అందజేయాలన్నారు. సమావేశంలో సీఆర్‌డీఏ అధికారులు చెన్నకేశవులు, ప్రభాకర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు