ప్రతి లబ్ధిదారుడికీ 1.5 సెంట్ల ఇంటి స్థలం

3 Jul, 2019 03:59 IST|Sakshi

గృహ నిర్మాణ శాఖ సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

లబ్ధిదారుడు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు 

ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు, పట్టాలు పంపిణీ 

గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా  

రాష్ట్రంలో ఇల్లు లేనివారంటూ ఉండకూడదు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికీ ఉగాది నాటికి 1.5 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు, పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంగళవారం ఆయన గృహ నిర్మాణ శాఖపై సమీక్షించారు. ‘ఇల్లు లేని వారు ఎవ్వరూ ఉండకూడదు. లబ్ధిదారుడు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన పనిలేదు. అన్ని జిల్లాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని  ఘనంగా చేపట్టాలి’ అని సీఎం అధికారులను ఆదేశించారు. వచ్చే సంవత్సరం నుంచి వైఎస్సార్‌ ఇళ్ల పథకం కింద నాలుగు విడతల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ‘గ్రామ వలంటీర్ల ద్వారా పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి. లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయంలోనే ప్రదర్శిస్తాం. పెన్షనర్ల జాబితా కూడా గ్రామ సచివాలయాల్లో బోర్డుపై ఉంచుతాం. ఆ జాబితా 365 రోజులు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలి. దీనివల్ల సోషల్‌ ఆడిట్‌ నిరంతరం కొనసాగుతున్నట్టు ఉంటుంది. లబ్ధిదారుల ఎంపికలో పక్షపాతం, అవినీతికి తావులేదు. ఎవరైనా తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మా పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత ఉంటే ఇల్లు ఇవ్వాల్సిందే. మేం చేసే మంచిని చూసి మాకు ఓటేయాలి అన్నదే మా సిద్ధాంతం. వ్యవస్థ మారాలి, ఆ తపనతోనే పని చేయండి’ అని అధికారులకు సూచించారు.  

అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్‌  
ఇళ్ల నిర్మాణం కోసం గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని వినియోగించాలని, అలా వీలుకాని చోట ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి పేదలకు ఇస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.‘ కొనుగోలు చేసిన భూమిని ప్లాట్ల రూపంలో విభజించి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ చేయాలి. కేవలం పట్టా ఇచ్చి, ఇంటి స్థలం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి లబ్ధిదారుడికి ఉండకూడదు. రాళ్లు పాతి, మార్కింగ్‌ వేసి పక్కాగా ఇంటి స్థలాన్ని అక్కచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలి. ఆధార్‌ కార్డుతో లింక్‌ చేసి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలి.  పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ భూమి ఎంత అందుబాటులో ఉందో చూడాలి. పట్టణాలు, నగరాల్లో భూమి లేకపోతే కొనుగోలు చేయండి. స్థలంలో ఫ్లాట్లు కట్టి లబ్ధిదారులకు ఇవ్వాలి. ఏ ఫ్లాట్‌ ఎక్కడ కడుతున్నారో ముందుగానే గుర్తించి పలానా ఫ్లాటు, పలానా వారికి వస్తుందని ముందుగానే కేటాయించండి. ఈ ఫ్లాట్ల లబ్ధిదారులకు భూమిలో అన్‌ డివైడెడ్‌ షేర్, దీంతోపాటు ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలి’ అని అధికారులను ఆదేశించారు.  
సచివాలయంలో మంగళవారం గృహ నిర్మాణ శాఖపై సమీక్షింస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

‘షేర్‌వాల్‌’ పేరుతో దోచేశారు.. 
షేర్‌వాల్‌ అనే పేరుతో ఇన్నాళ్లూ దోచేశారని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. చదరపు అడుగు ఇంటి నిర్మాణానికి రూ.1100 అయ్యే ఖర్చును రూ.2,300కు పెంచి దోచేశారని చెప్పారు. ‘షేర్‌వాల్‌ అని పేరుపెట్టి పేదలమీద భారం వేసి ఇలా దోచేస్తే ఎలా? పేదలపై ప్రతి నెలా రూ.3 వేల భారం వేయడం భావ్యమా? ఉచితంగా ఇళ్లు ఇవ్వాల్సిందిపోయి.. పేదవాడి మీద రూ.3 లక్షల భారం వేయడం న్యాయమా? అర్బన్‌ హౌసింగ్‌లో కడుతున్న ఫ్లాట్లపై రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలి. అదే టెక్నాలజీ, అదే స్పెసిఫికేషన్స్‌తో రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలి. కాంట్రాక్టర్లను వేధించడం ఉద్దేశం కాదు. మాకు ఎవరిపైనా కక్షలేదు. పేద వాడికి నష్టం రాకూడదు. 20 ఏళ్లపాటు నెలా నెలా డబ్బులు కట్టే పరిస్థితి ఆ పేదవాడికి ఉండకూడడు. లంచాల వల్ల బీదవాళ్లు నష్టపోకూడదన్నదే మా అభిప్రాయం. ఎక్కువ ప్రచారం చేసి, ఎక్కవ మంది రివర్స్‌ టెండరింగ్‌లో పాల్గొనేలా ఎలిజిబిలిటీ క్రైటీరియాను తగ్గిద్దాం. పునాది స్థాయి దాటని, మంజూరైనా ప్రారంభం కాని ఫ్లాట్ల్ల విషయంలో ఏ టెక్నాలజీ అయినా అనుమతించాలి. ఈ నిర్ణయం వల్ల ఎంత ఆదా చేయగలమో చేయండి. రూరల్‌ అయినా, అర్బన్‌ అయినా నాణ్యత విషయంలో, సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దు. ప్రస్తుతం నడుస్తున్న ఇళ్ల నిర్మాణంలో అత్యవసరంగా పూర్తి చేయాల్సిన వాటిని గుర్తించాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. 

సామాజిక, ఆర్థిక కుల గణనపై రీసర్వేకు ప్రధానికి లేఖ 
సామాజిక, ఆర్థిక కుల గణన సరిగా లేనందున కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో నష్టం జరుగుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రీసర్వే చేయాలని ప్రధానికి లేఖ రాద్దాం అని సీఎం పేర్కొన్నారు. సరిదిద్దిన డేటా ఆధారంగా ఇళ్లను కేటాయించాల్సిందిగా ప్రధాన మంత్రికి లేఖ రాయాలని నిర్ణయించారు. గ్రామ వలంటీర్ల సాయంతో డేటాను పూర్తిగా సేకరించి కేంద్రానికి పంపాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు