ప్రాణం తీసిన కుటుంబ కలహాలు

20 Jun, 2018 12:26 IST|Sakshi

తమ్ముడి భార్య బంధువులు దాడి చేసిన వైనం

తలపై బలంగా కొట్టడంతో మృతి

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు  

కుటుంబ కలహాల నేపథ్యంలో గురజాల మండలం మాడుగుల గ్రామంలో సోమవారం రాత్రి హత్య జరిగింది. తన తమ్ముడు గనిపల్లి అమ్మోసు, అతని భార్య ఏసమ్మ గొడవపడుతుండగా గనిపల్లి శ్యామేలు (35) సర్దిచెప్పేందుకు ప్రయత్నించాడు. ఏసమ్మ కుటుంబ సభ్యులు కర్రతో మోదడంతో శ్యామేలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.

గుంటూరు జిల్లా /గురజాల : కుటుంబంలో చేలరేగిన కలహాలు వ్యక్తి హత్యకు దారి తీశాయి. ఈ ఘటన గురజాల మండలంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాల ప్రకారం.. మాడుగుల గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న గనిపల్లి శ్యాయ్మేలు (35)హత్యకు గురయ్యాడు. తమ్ముడు గనిపల్లి అమ్మోసు అతని భార్య ఏసమ్మలు సోమవారం రాత్రి భోజనం సమయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో అమ్మోసు ఇంటి పక్కనే నివాసం ఉంటున్న అన్న శ్యాయ్మేలు తమ్ముడు, మరదల గొడవను చూసి సర్థిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా ఏసమ్మ భర్తతో పెద్దగా అరుస్తూ వాగ్వాదానికి దిగుతోంది. ఇంతలో ఆమె కుటుంబ సభ్యులు  టి.బాబు, రమేష్, యోహాన్, ఏసోబు, రాజేష్, సీతారావమ్మ, సీతమ్మ, ఆదాంలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వచ్చారు. 

ఈ క్రమంలోనే  భార్యభర్తలకు సర్థి చెబుతున్న శ్యాయ్మేలును వస్తూ వస్తూనే తలపై కర్రతో గట్టిగా కొట్టారు. తీవ్ర గాయం కావడంతో క్షతగాత్రుడిని స్థానికులు ఆటోలో గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం  గుంటూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో శ్యాయ్మేలు మృతి చెందాడు. మృతుడు కుమారుడు చిన్నరాజు ఫిర్యాదు మేరకు సీఐ వై.రామారావు ఏసమ్మతో పాటు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఎప్పుడూ గొడవలే..
మృతుడు శ్యామేలు తమ్ముడు అమ్మోసు అదే గ్రామానికి చెందిన ఏసమ్మను తొమ్మిదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. తమ్ముడు కుటుంబంలో ఎప్పుడూ గొడవలు వస్తుండేవి. మృతుడు శ్యాయ్మేలు సర్థి చెప్పేవాడు. గతంలో కూడా అమ్మోసుపై భార్య ఏసమ్మ రెండు సార్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గర్భిణిగా ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్లి  బిడ్డకు జన్మనిచ్చిన కొన్నాళ్లకు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నన్ను చంపేందుకు భర్త అమ్మోసు ప్రయత్నించాడని కేసు పెట్టింది. పెద్దలు రాజీ కుదర్చడంతో విషయం చల్లారింది. తర్వాత మరికొద్ది రోజులకు ఏసమ్మ కుటుంబ సభ్యులు బంగారు అభరణాలు దొంగతనం కేసును కూడా అమ్మోసుపై పెట్టారు. తన భార్య రెండు నెలల కిందటే పుట్టింటి నుంచి ఇక్కడికి వచ్చిందని మృతుడు తమ్ముడు అమ్మోసు తెలిపారు. 

పలువురి పరామర్శ..
శ్యాయ్యేలు మృతదేహన్ని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ నాయకుడు ఎనుముల మురళీధర్‌రెడ్డి, మండల కన్వీనర్‌ సిద్ధాడపు గాంధీ, పట్టణ కన్వీనర్‌ కె.అన్నారావులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి.. ఘటన జరిగిన  తీరును అడిగి తెలుసుకున్నారు.  

మరిన్ని వార్తలు