ఇద్దరే ఇద్దరు !

20 Jun, 2018 13:47 IST|Sakshi
డిగ్రీ కళాశాల కోసం సిద్ధం చేసిన జూనియర్‌ కళాశాల భవనం 

కళాశాలలో కేవలం ఇద్దరు విద్యార్థుల చేరిక

బి.కొత్తకోట డిగ్రీ కళాశాల ప్రారంభానికి అన్నీ అపశకునాలే

2014లో సీఎం చంద్రబాబు మాటిస్తే ఈ విద్యా సంవత్సరం జీఓ

తరగతుల ప్రారంభం లేనట్టే

సాక్షి, బి.కొత్తకోట : 2014 నవంబర్‌ 5న అంగళ్లులో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బి.కొత్తకోటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేసి, అందులో వృత్తిపరమైన కోర్సులు అందిస్తామని ప్రకటించారు. దానికోసం నిరుపేద విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్లు గడిచినా కదలికలేదు. 2016 చివర్లో కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీచేసి చేతులు దులుపుకుంది. తర్వాత దీని గురించి పట్టించుకోలేదు. రెండు నెలల క్రితం ప్రభుత్వం మరో జీఓ జారీ చేస్తూ అధ్యాపకులు, సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశాలిచ్చింది. పుంగనూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకట్రామను ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా నియమించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని ఖాళీ భవనాల్లో తరగతులు తాత్కాలికంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల చేరిక కోసం ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్, కొందరు అధ్యాపకులు పల్లెల్లో పర్యటించి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించారు. అయినా ఫలితం మాత్రం శూన్యం.


చేరింది ఇద్దరే..
కళాశాలలో మంగళవారం నాటికి ఇద్దరు విద్యార్థులు మాత్రమే చేరారు. వీరిలో పెద్దతిప్పసముద్రం మండలం కమ్మపల్లెకు చెందిన సి.నరేంద్ర, రంగసముద్రానికి చెందిన షేక్‌ వలీ ఉన్నారు. డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల చేరికపై ఉన్నత విద్యాశాఖ ఈనెల 18న ప్రకటన చేసింది. తొలివిడతలో ఈ కళాశాలలో చేరిన వారు ఇద్దరే. ఈ నెలాఖరులో మరోసారి ప్రకటన ఇవ్వనుంది. బి.కొత్తకోట కళాశాలలో ఈ విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభించాలంటే బీఏకు 25మంది, బీకాంకు 25 మంది విద్యార్థులు అవసరం. ఈ సంఖ్యను ఈనెల 30వ తేదీలోగా చేరుకోకుంటే తరగతులు ప్రారంభమయ్యేది ప్రశ్నార్థకమే.


కారణాలేమిటి?
డిగ్రీ కళాశాలను ప్రారంభిస్తున్నా విద్యార్థులు చేరకపోవడానికి ప్రభుత్వ పరంగా చర్యలు సక్రమంగా లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆలస్యంగా జీఓ జారీ చేయడం, విద్యార్థుల చేరిక విషయంలో సరైన ప్రచారం లేకపోవడం కనిపిస్తోంది. ప్రయివేటు కళాశాల సిబ్బంది పల్లెలకు వెళ్లి ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులను చేర్పించుకోవడం, టీసీలు తీసుకోవడం లాంటి చర్యలతో ప్రభుత్వ కళాశాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలిగించే ఈ కళాశాల తరగతుల నిర్వహణకు తగిన సంఖ్య లేకపోవడం ఆవేదన కలిగిస్తోందని ప్రభుత్వ అధ్యాపకులు చెబుతున్నారు. మిగిలిన 10 రోజుల్లోనైనా ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కాపాడుకునే వీలుంది.

మరిన్ని వార్తలు