చట్టప్రకారమే ఉద్యోగులకు ఆప్షన్లు

24 May, 2014 02:21 IST|Sakshi
చట్టప్రకారమే ఉద్యోగులకు ఆప్షన్లు

* సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల పోరానికి చంద్రబాబు భరోసా
* కేంద్ర హోంశాఖ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన
* బిల్లులో అవకతవకలను సవరించేలా కేంద్రంతో మాట్లాడతా

 
సాక్షి, హైదరాబాద్:
కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారమే ఉద్యోగుల విభజన, ఆప్షన్లు ఉంటాయని, ఈ విషయంలో ఎవరి ఒత్తిళ్లూ పనిచేయవని తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్  కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ఏపీ ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ, కన్వీనరు వెంకట సుబ్బయ్య, కో ఆర్డినేటర్ రవీందర్ నేతృత్వంలో రెండు సంఘాల ప్రతినిధులు శుక్రవారం చంద్రబాబును ఆయన నివాసంలో వేర్వేరుగా కలిశారు. ఉద్యోగులు ఎవరి రాష్ట్రాలకు వారు వెళ్లాల్సిందేనని, ఆప్షన్లు ఉండవని, సీమాంధ్ర ఉద్యోగులను ఎవరినీ తెలంగాణ సచివాలయంలో అడుగుపెట్టనీయబోమని తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఉద్యోగులు భయాందోళనలకు లోనవుతున్నారని వారు చంద్రబాబుకు చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా కోరారు. ఉద్యోగుల విభజన కేంద్ర హోంశాఖ నిబంధనల ప్రకారమే జరుగుతుందని, బెదిరిస్తే చట్టం మారదని, అనవసరంగా ఉద్యోగుల మధ్య వివాదాలు సృష్టించడం మంచి పద్ధతి కాదని  ఈ సందర్భంగా కేసీఆర్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎవరికీ అన్యాయం జరగకుండా తాను చూసుకుంటానని, చట్టం, నిబంధనల ప్రకారమే  ఉద్యోగుల విభజన జరుగుతుందని,  ఈ విషయంలో ఎవరూ అధైర్యపడవద్దని భరోసానిచ్చారు.
 
  తెలంగాణకు కేటాయించిన ఉద్యోగుల్లో కొందరి మూలాలు సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నాయని కేసీఆర్ అన్నంత మాత్రాన సరిపోద ని చంద్రబాబు చెప్పారు. ఈ విషయంలో తాను కేంద్రంతో కూడా మాట్లాడతానని తెలిపారు.  రాజ్యాంగపరంగా మీకు ఉన్న హక్కును ఎవ్వరూ కాదనలేరని ఉద్యోగ సంఘాల నేతలతో చెప్పారు.
 
  డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన కొనసాగుతుందనే ప్రచారం జరుగుతోందని, దీంతో సచివాలయ ఉద్యోగుల్లో కొంత భయాందోళన నెలకొందని నేతలు వివరించారు. అలాంటిది ఏమీ లేదని, తాను సచివాలయంలోని హెచ్ బ్లాక్‌కు వస్తానని, అక్కడి నుంచే పరిపాలన సాగిస్తానని బాబు చెప్పారు. రాష్ట్ర పునర్‌విభజన బిల్లులో కొన్ని అవకతవకలు ఉన్నాయని, కేంద్రంతో మాట్లాడి వాటి సవరించేలా చూస్తానని హామీ ఇచ్చారు.
 
 చెప్పుడు మాటలు విని తప్పుడు మాటలు మాట్లాడవద్దు
 కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగుల విభజన  జరుగుతున్న సమయంలో  సమగ్ర సమాచారం లేకుండా చెప్పుడు మాటలు విని తప్పుడు మాటలు మాట్లాడటం మంచిది కాదని  కేసీఆర్‌కు చంద్రబాబు సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. సీమాంధ్ర ఉద్యోగులను బలవంతంగా రుద్దితే గేటు కూడా దాటనివ్వం... కాలు దువ్వితే కొట్లాటకైనా రెడీ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఉద్యమాన్ని భావోద్వేగాలతో ముడిపెట్టి సీట్లు, ఓట్లు సంపాదించుకున్నది చాలక అన్నదమ్ముల మధ్య  కీచులాటలు, శాశ్వత వైరుధ్యం సృష్టించటం కేసీఆర్‌కు తగదని హితవు పలికారు. ఇరు ప్రాంతాల్లో సుహృద్భావ వాతావరణం పెంపొందించి అన్నదమ్ముల్లా కలిసుండే పరిస్థితులను నెలకొల్పాలే గానీ  సీఎం స్థాయి వ్యక్తి శాంతి భద్రతల సమస్య సృష్టించే విధంగా మాట్లాడటం భావ్యం కాదని చెప్పారు. ఇకనైనా ఇటువంటి ఉద్రిక్తతలు పెంచే ప్రసంగాలు మానేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు