మౌనంగానే ఎదగమని..

8 Mar, 2018 11:37 IST|Sakshi
తన చిత్రాల ప్రదర్శనలో కౌసర్‌

చిత్రకళలో రాణిస్తున్న కౌసర్‌బాను

ఆమెను వరించిన అంతర్జాతీయ బహుమతులు

అడగకముందే మనకు అన్నీ ఇచ్చాడు దేవుడు. అప్పుడప్పుడూ పొరపాటుపడి ఇవ్వాల్సినవి ఇవ్వకపోయినా.. ఇచ్చి తీసేసుకున్నా మనం ఏం చేయగలం! ప్చ్‌.. మన రాత ఇంతేనని నిట్టూర్చి మిన్నకుండిపోతాం. కానీ మన ‘కౌసర్‌భాను’ అలా ఊరికే ఉండిపోలేదు. దేవుడి నుంచి మరోటి లాగేసుకుంది. ‘గీత’ నేర్చుకుంది.. రాత మార్చుకుంది. వైకల్యాన్ని అధిగమించేందుకు కాస్తంత ప్రోత్సాహం ఉంటే చాలుననీ, ఆ ఆసరాతో పోగొట్టుకున్న దాని కంటే ఎక్కువ సాధించవచ్చని నిరూపిస్తున్నారు. ఆమెనే కౌసర్‌బాను.

కడప కల్చరల్‌ : కడప నగరానికి చెందిన కౌసర్‌బానుది మధ్య తరగతి కుటుంబం. తండ్రి ముర్తుజాకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కౌసర్‌ చిన్న కుమార్తె. అందరిలాగానే ఆడుతూ, పాడుతూ ఎంతో సరదాగా ఉండేది. అందరితో వస పిట్టలా మాట్లాడుతూ ఉండేది. సరిగ్గా అక్కడే ఆమె జీవితం పెద్ద మలుపు తిరిగింది. నాలుగున్నరేళ్ల చిన్నారి కౌసర్‌కు జ్వరం. తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రుల్లో చూపించారు. ఒకచోట వైద్యం వికటించింది. గలగలా మాట్లాడుతూ తిరిగే తమ చిన్నారి ఉన్నట్లుండి ‘మౌనమే నా భాష’ అన్నట్లుగా ఉండిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పాడుజ్వరం తన  మాటను తీసుకెళ్లిందని, తను మాట్లాడలేకపోతోందని ఆ చిట్టి మనసు అర్థం చేసుకుంది. తనకు ప్రాణప్రదమైన అమ్మానాన్నల కళ్లల్లో నీటితడికి బదులుగా ఆనందం చూడాలని గట్టిగా నిర్ణయించుకుంది.

రంగుల లోకంలో...
కౌసర్‌కు బొమ్మలు గీయడమంటే చాలా ఇష్టం. నచ్చిన ప్రతి బొమ్మను గీసేది. మూడున్నరేళ్ల వయసులోనే చక్కని చిత్రాలు గీస్తున్న కుమార్తెను చూసి అమ్మానాన్న ప్రోత్సహించారు. చెప్పదలుచుకున్న విషయాన్ని బొమ్మల ద్వారా చెప్పడం గమనించారు. ప్రోత్సాహాన్ని కొనసాగించారు. అక్క అర్షియ ఏదైనా పోటీలకు వెళ్లేటపుడు తానూ వస్తానని కౌసర్‌ మారాం చేసేది. కాస్త మార్పుగా ఉంటుందని తీసుకెళ్లేది. పోటీల్లో పాల్గొని చెల్లి బహుమతులు సాధిస్తుండడంతో అక్క ఆమెకు తన డ్రాయింగ్‌ సామగ్రి ఇచ్చి ప్రోత్సహించేది. ఈ ప్రత్యేకతను గమనించిన తల్లిదండ్రులు రషీదా, ముర్తుజా, అన్న అసదుల్లా కౌసర్‌కు అవసరమైన డ్రాయింగ్‌ సామగ్రిని సమకూరుస్తూ ఉత్సాహ పరిచారు. పర్యాటకం సీతారామయ్య, అక్క స్నేహితులు నాగవేణి, అఖిల ఆమె గీసిన చిత్రాలతో ప్రదర్శనలు నిర్వహింపజేశారు.

ఆలోచనాత్మకం
కౌసర్‌ సమకాలీన సమస్యలపై పలు పెయింటింగ్‌లు గీశారు. ముఖ్యంగా మహిళా సాధికారత, భ్రూణహత్యలు, మసిబారుతున్న పసితనం ప్రధాన అంశాలుగా ప్రతిభావంతమైన చిత్రాలు గీశారు. ఎందరో ప్రముఖ వ్యక్తులు, దేశభక్తుల చిత్రాలు కూడా గీశారు. ముఖ్యంగా సింహం చిత్రంలో సూక్ష్మ మైన అంశాలను కూడా వదలకుండా గీసిన తీరు ఆమె సునిశిత పరిశీలనాశక్తికి నిదర్శంగా నిలుస్తోంది. పలు చిత్రాలు విమర్శకులను సైతం మెప్పించాయి. కౌసర్‌లో మరో ప్రత్యేకత కూడా ఉంది. పనికిరాని వస్తువులతో కళ్లు చెదిరే ఆకర్షణీయమైన వస్తువులను తయారు చేస్తుంది. కోడిగుడ్ల డొల్లలు, పాత సీసాలు, ఐస్‌క్రీమ్‌ కప్‌లు, స్ట్రాలు ఇలా అన్నింటినీ కళాత్మకంగా రూపొం దిస్తోంది. ముఖ్యంగా ఆమె తయారు చేసిన కాగితం నగలు అందరినీ ఆకర్శిస్తున్నాయి.

అంతర్జాతీయ అవార్డులు
కౌసర్‌ స్థానికంగా వందలాది పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. గండికోట ఉత్సవంలో స్పాట్‌ పెయింటింగ్‌ చేసి బహుమతి సాధించి సత్తా చాటారు. పికాసో ఆర్ట్‌ సంస్థ వారు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించే పోటీల్లో ఆమెకు రెండు మార్లు వరుసగా బహుమతులు లభించాయి. 2016లో ఆమె ఈ పోటీల్లో ద్వితీయ బహుమతి, 2017లో ప్రథమ బహుమతి సాధించారు. కంగ్రాట్స్‌.. అంటూ అభినందిస్తే కౌసర్‌ మెత్తగా నవ్వేస్తుంది.. ప్రస్తుతం స్పీచ్‌ థెరఫీ తీసుకుంటున్న కౌసర్‌భాను త్వరలో ‘సాక్షి’కి స్వయంగా ధన్యవాదాలు చెప్పగలదని ఆశిద్దాం!

మరిన్ని వార్తలు