పండుల వారు అక్కడ ఉండరు!

7 Feb, 2019 08:09 IST|Sakshi

అమలాపురం ఎంపీ... కేరాఫ్‌ కాకినాడ

సొంత నియోజకవర్గంలో ఎంపీ రవీంద్రబాబుకు స్థానికత ఏది..?

ఆయనతో అత్యవసర పని పడితే కాకినాడ కార్యాలయానికి వెళ్లాల్సిందే

మిగతా ఎంపీలతో పోల్చుకుంటే నియోజకవర్గ పర్యటనలు తక్కువే

తూర్పుగోదావరి, అమలాపురం టౌన్‌: ఆయన అమలాపురం నియోజకవర్గానికి అధికార పార్టీ ఎంపీ. పేరు డాక్టర్‌ పండుల రవీంద్రబాబు. ఆయన అమలాపురం నుంచి ఎన్నికైనా.. ఆయన కార్యాలయం మాత్రం జిల్లా కేంద్రం కాకినాడలో ఉంటుంది. సొంత నియోజకవర్గంలో ఆయనకు స్థానిక చిరునామా లేదు. తన స్థానికతను చూపించేందుకు కనీసం కార్యాలయం కూడా లేదు. జిల్లాలోని మిగిలిన ఎంపీలైన రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్, కాకినాడ ఎంపీ తోట నరసింహం లకు ఆయా పార్లమెంట్‌ నియోజకవర్గ కేంద్రాల్లో సొంత కార్యాలయాలు ఉన్నాయి. సాధారణంగా ఎంపీలు సొంత కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటారు. ఎంపీతో ప్రజలకు ఏదైనా పని పడితే వారి ఆ కార్యాలయానికి వచ్చి ఆర్జీలు ఇచ్చుకునేందుకు...ఎంపీ ఉంటే స్వయంగా కలసి తమ వినతులు చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. 2014 ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఐఆర్‌ఎస్‌ అధికారిగా ఐటీ, కస్టమ్స్‌ల్లో పనిచేసిన ఆయన అమలాపురం ఎంపీ టీడీపీ అభ్యర్థిగా స్థానికత లేకుండా దిగుమతి అభ్యర్థిగానే రంగంలోకి దిగారు. ఎన్నికల్లో దిగుమతి అభ్యర్థులు రావడం..పోటీ చేయడం సాధారణమే. అయితే ఎంపీగా గెలిచిన తర్వాత స్థానికత కోసం కాకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని అందులో ఒకరిద్దరి ఉద్యోగులను అందుబాటులో ఉంచడం కూడా సాధారణమే.

ఎంపీ రవీంద్రబాబు జిల్లాలోని మిగతా ఇద్దరి ఎంపీలతో పోల్చితే నియోజకవర్గంలో ఆయన పర్యటించిన సందర్భాలు తక్కువే. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల్లో... ప్రారంభోత్సవాల్లో ఆయన అప్పుడప్పుడూ మాత్రమే పాల్గొంటారు. గత  నాలుగున్నరేళ్లలో ఆయన అమలాపురంలో ప్రెస్‌మీట్‌లు ఏర్పాటు చేసి మాట్లాడిన సందర్భాలు కూడా వేళ్ల మీద లెక్క కట్టేలా ఉంటాయి. గతంలో అమలాపురం ఎంపీలుగా పనిచేసిన లోక్‌సభ మాజీ స్పీకర్‌ దివంగత జీఎంసీ బాలయోగి, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ సైతం వారు ఎంపీగా పనిచేసినంత కాలం అమలాపురంలో కార్యాలయాలు ఏర్పాటుచేసి  ప్రజలకు అందుబాటులో ఉండేవారు. వాస్తవానికి బాలయోగి కాకినాడలో... హర్షకుమార్‌ రాజమహేంద్రవరంలో ఉండే వారు. అయినప్పటికీ అమలాపురం ఎంపీలైన తర్వాత వారు అమలాపురం కేంద్రంగా కార్యాలయాలను నిర్వహించడమే కాకుండా ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ తమ కార్యాలయాల్లో కొంత సమయం ఉండేవారు. జిల్లాలో ప్రస్తుత మిగతా ఇద్దరు ఎంపీలు, గతంలో అమలాపురం ఎంపీలుగా పనిచేసిన వారు స్థానిక కార్యాలయాల్లో ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటున్నారో...ఉండేవారో అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుని... పోల్చుకుంటూ చర్చించుకుంటున్నారు.

తాజా వివాదంలో ఎంపీ తీరుపై చర్చోపచర్చలు
ఇదిలా ఉండగా ఇటీవల ఎంపీ రవీంద్రబాబు కోనసీమ రైల్వేలైన్‌కు నిధుల సాధన సందర్భంగా ఇక్కడ రైల్వేలైన్‌ కోసం పోరాడిన కోనసీమ జేఏసీ ప్రతినిధులను పిట్టల దొరలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై జేఏసీ ప్రతినిధులు ప్రతి స్పందిస్తూ ఎంపీకి అల్టిమేటమ్‌ ఇచ్చిన విషయమూ విదితమే. ఇదే సమయంలో పార్లమెంట్‌ నియోజకర్గ ప్రజలు ఎంపీ పనితీరుపై గతంలో కంటే ఎక్కువగా చర్చించుకోవడం కనిపిస్తోంది. ఎంపీకి ఏదైనా వినతి పత్రం ఇవ్వాలంటే ఆయన ఎప్పుడు వస్తారు...ఎక్కడకు వస్తారు...? అనే సమాచారం తెలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు అంటున్నారు. అమలాపురంలో ఆయనకు సంబంధించిన కార్యాలయం ఉంటే అక్కడకి వెళ్లి సమాచారం తెలుసుకునేవాళ్లం. కాకినాడలో కార్యాలయం ఉండడం వల్ల ఎంపీ సమాచారం చెప్పేవారే కరవవుతున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎంపీతో మరీ అత్యవసరమైన పని పడితే కాకినాడ కార్యాలయానికి వెళ్లవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు