పింఛన్ పాట్లు

19 Dec, 2014 03:31 IST|Sakshi
పింఛన్ పాట్లు

తిరుపతి క్రైం: అధికారుల్లో ముందుచూపు లేకపోవడం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడ్డం పింఛనుదారుల పాలిట శాపంగా మారుతోంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు గంటల తరబడి  పింఛన్ కోసం ఎదురు చూసేలా, రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేస్తోంది. గురువారం తిరుపతిలోని ప్రధాన తపాలా కార్యాలయాన్ని చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
 
గ్రామీణ ప్రాంతాల్లో తపాలశాఖ ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సైతం తపాలాశాఖ ఆధ్వర్యంలోనే పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయకపోవడంతో గందరగోళం నెలకొంది. తిరుపతితో పాటు జిల్లాలోని దాదాపు 32వేల మందికి పింఛన్ మంజూరు చేయాల్సి ఉంది. ఏపీ ఆన్‌లైన్, డీఆర్‌డీఏ నగర పాలక సంస్థ అవగాహన చేస్తూ బయోమెట్రిక్ యంత్రాలను తపాలాశాఖకు అందించాయి. తిరుపతిలో 10  తపాలా కార్యాలయాల్లో బయోమెట్రిక్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. అయితే కేటాయింపుల్లో నిర్లక్ష్యం చూపారు. నివాసం ఉన్న ప్రాంతం ఒకటైతే పింఛన్ ఇచ్చే కార్యాలయం మరో ప్రాంతంలో కేటాయించారు. దీంతో పింఛన్‌దారులు ఏ కార్యాలయానికి పోవాలో తెలియక హెడ్‌పోస్టాఫీస్‌కు చేరుకుంటున్నారు.
 
ఎక్కడ పింఛన్ తీసుకోవాలో తెలియకే...
తిరుపతిలో దాదాపు 4,800 మంది లబ్ధిదారులున్నారు. ఏపీ ఆన్‌లైన్‌లో ఇచ్చిన సమాచారం మేరకు వారికి ఖాతాలు తెరిచి పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఈ సోమవారం నుంచి పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న పింఛన్ పొందే వృద్ధులు, వికలాంగులు తిరుపతిలోని ప్రధాన కార్యాలయానికి నాలుగు రోజులుగా తండోపతండాలుగా చేరుకుంటున్నారు. ఇటు తపాలాశాఖ అధికారులు ఏమి చేయాలో అర్థం కాక ప్రతి ఒక్కరికీ నచ్చజెప్పుకుంటూ వారికి మార్గనిర్దేశం చేసి పంపిస్తున్నారు. అయినా గంటల తరబడి వృద్ధులు, వికలాంగులు పింఛన్ల కోసం తపాలా కార్యాలయం వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. తమ ఇళ్ల వద్దకే వచ్చి పింఛను పంపిణీ చేస్తే బాగుంటుందని పింఛన్లు పొందే వృద్ధులు, వితంతువులు వికలాంగులు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు