పింఛన్లేవీ..

11 Nov, 2013 05:41 IST|Sakshi

పర్చూరు, న్యూస్‌లైన్:  పింఛన్ల పంపిణీలో యంత్రాంగం అలసత్వాన్ని వీడటం లేదు. జిల్లాలో ఆగస్టు నెలలో పంపిణీ చేయాల్సిన పింఛన్లు నేటికీ ఇవ్వలేదు. జూలై వరకు ఫినోకంపెనీ తరఫున గ్రామాల్లో సీఎస్‌పీల ద్వారా పింఛను సొమ్ము పంపిణీ చేశారు. సంబంధిత శాఖల సిబ్బందితో వారు కుమ్మక్కై చేతివాటం ప్రదర్శిస్తుండటంతో ఈ ప్రక్రియను నిలిపేశారు. దీంతో ఆగస్టు నెలలో పింఛను సొమ్మును పంచాయతీ కార్యదర్శుల ద్వారా పంపిణీ చేసేందుకు జిల్లా డీఆర్‌డీఏ అధికారులు ఎంపీడీఓల ఖాతాలకు నగదు జమ చేశారు. పంపిణీ ప్రారంభించక ముందే పాతపద్ధతిలో పోస్టాఫీసుల ద్వారా నగదు పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎంపీడీఓలు తమ ఖాతాలో ఉన్న సొమ్మును డీఆర్‌డీఏ ఖాతాకు బదలాయించారు. కానీ నేటికీ ఆగస్టు నెల పింఛన్ల పంపిణీకి జిల్లా డీఆర్‌డీఏ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో జిల్లాలో  పింఛను కోసం 2,84,620 మంది ఎదురుచూస్తున్నారు. 

వీరిలో వృద్ధాప్య పింఛను అందుకునేవారు 1,61,139 మంది, చేనేత పింఛన్లు 6646 మంది, వికలాంగ పింఛన్లు 28,930 మంది, వితంతు పింఛన్లు 70,120 మంది, అభయహస్తం పింఛన్లు అందుకునేవారు 17,450 మంది ఉన్నారు.  పింఛను సొమ్ము కోసం ఎంపీడీఓ కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు, పోస్టాఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఎప్పుడిస్తారనేది స్థానిక అధికారులకు కూడా తెలియని పరిస్థితి. దీంతో  పింఛనుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వెంటనే పింఛన్లు అందజేయాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు.
 సమ్మె కారణంగానే ఆలస్యం
 డీఆర్‌డీఏ ఏపీడీ: తేళ్ల రవికుమార్
 ఆగస్టు నెలలో పింఛన్ల పంపిణీ కోసం సొమ్మును ఎంపీడీఓల ఖాతాలో జమచేశాం. ఎంపీడీఓలు సమ్మెలో ఉన్న కారణంగా పంపిణీ ఆలస్యమైంది. దీంతో వారి ఖాతాలోని సొమ్మును తిరిగి జిల్లా డీఆర్‌డీఏ ఖాతాకు జమచేశారు. ఈ ప్రక్రియ వల్ల పంపిణీ ఆలస్యమైంది. వెంటనే నగదు అందించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు