అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీతో దుళ్ళ ప్రజల ఇక్కట్లు

10 Jul, 2019 07:58 IST|Sakshi
దుళ్ళ బీసీ కాలనీలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ దుస్థితి 

సాక్షి, కడియం (తూర్పుగోదావరి) : వాడుక నీరు గొట్టాల్లోకి వెళ్లి అక్కడి నుంచి ఎవరో ఒకరి ఇంటి ఆవరణలోకి వస్తోంది. లేకపోతే మ్యాన్‌హోల్స్‌ నుంచి లీకై నేరుగా రోడ్డు మీదకే చేరుతోంది. దుర్వాసనతో కూడిన ఆ మురుగు నీటిలో ఇటుకలు వేసి వాటి మీద నుంచి అక్కడి ప్రజలు నడవాల్సిన దుస్థితి. ఇదీ మోడల్‌గా అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించిన దుళ్ళ గ్రామంలోని ఎర్రకాలనీ, బీసీ కాలనీల్లోని పరిస్థితి. ఈ నరకం నుంచి తమకు విముక్తి కలిగించండి మహాప్రభో అంటూ వాటిని చూసేందుకు వచ్చిన అధికారులు, నాయకులను స్థానికులు వేడుకొంటున్నారు.

అప్పటి మంత్రి నారా లోకేష్‌ స్వయంగా పర్యవేక్షించిన పంచాయతీరాజ్‌ శాఖ పర్యవేక్షణలో సాగిన ఈ నిర్లక్ష్య నిర్మాణం కారణంగా తాము పడుతున్న కష్టాలను కనిపించిన ప్రతి ఒక్కరికీ వారు వివరిస్తున్నారు. కేవలం రెండంటే రెండు వర్షాలు కురిశాయో లేదో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వేసినంత మేరా అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక భారీ వర్షాలు కురిస్తే ఎంతటి దుర్భర పరిస్థితులుంటాయోనని దుళ్ళ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కూలికి వెళ్తేనే కానీ రోజు గడవని ఆ కుటుంబాలు అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ కారణంగా ఏర్పడిన మురికి కూపంలో బతకలేక తల్లడిల్లుతున్నారు. నిర్మాణ సమయంలో వచ్చిన అధికారులు కానీ, నాయకులు కానీ ఇప్పుడు కనిపించడం లేదని, తమ ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు గొట్టాలు ఏర్పాటు చేసేందుకు జరిపిన తవ్వకాల్లో పలుచోట్ల తాగునీటి పైపులైన్లు కూడా దెబ్బతిన్నాయి. పనులు జరుగుతున్నంతసేపూ నీటిని విడుదల చేయకుండా కాంట్రాక్టర్లు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. తీరా ఇప్పుడు తాగునీరు విడుదల చేస్తూంటే ఎక్కడికక్కడ నీరు లీకైపోతోంది. ముఖ్యంగా బీసీ కాలనీలో మొత్తం తాగునీటి పైపులైన్‌ వ్యవస్థ అధ్వానంగా తయారైంది. దీంతో నెల రోజులుగా నీటిని విడుదల చేయడం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వం తలాతోకా లేకుండా, ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడకుండా చేసిన పనులకు దుళ్ళలో జరిగిన అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ పరాకాష్టగా కనిపిస్తోంది.

ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?
► దుళ్ళ గ్రామంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీకి వాడిన పైపులైన్ల సామర్థ్యం వాస్తవంగా సరిపోతుందా?
►  పనులు చేసిన కాంట్రాక్టర్లకు తగిన అనుభవం ఉందా?
► పనులు జరుగుతున్నప్పుడు అసలు పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీర్లు పర్యవేక్షించారా?
►  మోడల్‌గా నిర్మించామని చెబుతున్నారు. ఒకవేళ విఫలమయితే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉందా?
►  ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ సక్రమంగా పని చేయడం లేదు. ఇందుకు కాంట్రాక్టర్లపై తీసుకునే చర్యలేమిటి?
►  ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు తీసుకునే తక్షణ చర్యలేమిట
►  మురుగునీటి వ్యవస్థ నిర్మాణంలో సదరు నీరు బయటకు వెళ్లే మార్గం అత్యంత ప్రధానమైనది. అటువంటి అవకాశం లేకుండా అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించేందుకు ఎలా సిద్ధమయ్యారు?

ఉండలేకపోతున్నాం
అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం వేసిన పైపులు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. మురుగునీరు వెనక్కి తన్నుకొస్తోంది. ఇంట్లోకి కూడా దుర్వాసన వస్తోంది. వీధుల్లో కూడా అదే పరిస్థితి. ఉండలేకపోతున్నాం. మా పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. ఏ డ్రైనూ లేనప్పుడే బాగుంది.
– జి.వెంకటలక్ష్మి

మరీ దారుణం
మురుగునీరు బయటకు వెళ్లేందుకు ఏమాత్రం అవకాశం లేదు. కానీ పనులు మాత్రం చేసేశారు. అవి కూడా అత్యంత దారుణంగా చేశారు. అసలు ఈ గొట్టాల నిర్మాణం చూస్తే ఇందులో నుంచి నీరు ఎలా వెళ్తుందని వేశారో అర్థం కావడం లేదు. అధికారులు, నాయకులు ఇక్కడకొచ్చి చూస్తే మా బాధలు అర్థమవుతాయి.
– ఎం.కుమారి

మరిన్ని వార్తలు