నిర్వహణ లోపంతో మూలనపడుతున్న తాగునీటి పథకాలు

23 Dec, 2013 02:00 IST|Sakshi

ఒంగోలు, న్యూస్‌లైన్:  గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం వాటర్ ట్యాంకులు నిర్మించినా నిర్వహణ  లోపం కారణంగా అవి పనికిరాకుండా పోతున్నాయి. జిల్లాలోని తాగునీటి పథకాలను ‘న్యూస్‌లైన్’ బృందం ఆదివారం పరిశీలించింది. వందలాది పథకాలు ఎంత అధ్వానంగా, నిరుపయోగంగా ఉన్నాయో వెలుగు చూసింది.

 జిల్లాలో 38 సమీకృత రక్షిత మంచినీటి పథకాలు, 1672 రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి. ఇటీవల పర్చూరు, కొండపి, ఒంగోలు, అద్దంకి, మార్కాపురం, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని 36 వాటర్ ట్యాంకులు మరమ్మతులకు గురయ్యాయి. కొన్ని ఫిల్టర్‌బెడ్లు అపరిశుభ్రంగా మార గా, పలుచోట్ల మోటార్లు కాలిపోవడం, పైపులైను మరమ్మతులకు గురయ్యాయి. వీటి మరమ్మతులకు * 30.50 లక్షలు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపినా నేటికీ ఒక్కపైసా కూడా విడుదల కాలేదు.  
 ఒంగోలు నియోజకవర్గంలో సర్వేరెడ్డిపాలెం చెరువుకు గండిపడడంతో చెరువులో నీరు మొత్తం బయటికి పోయి రెండు ఓవర్‌హెడ్ ట్యాంకులు అలంకార ప్రాయంగా మారాయి. కరువది, చేజర్ల, మండువవారిపాలెం, పెళ్లూరు గ్రామాలకు ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉన్నప్పటికీ అవి ఆశించిన ప్రయోజనం కల్పించలేకపోతున్నాయి. గ్రామీణ తాగునీటి పథకాల ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్వహణ పంచాయతీలకు సంబంధించింది కావడం, సుదీర్ఘ కాలం పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉండడంతో చాలా వరకు పథకాలు మూలనపడ్డాయి. ఒంగోలు నగరంలోనే కొత్తపట్నం బస్టాండు సెంటర్‌లో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణం పూర్తయి  నిరుపయోగంగా ఉంది.
 పేర్నమిట్ట పంచాయతీ పరిధిలోని అరుణోదయ కాలనీలో ప్రజల దాహార్తి తీర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి * 30 లక్షలు మంజూరు చేసిన ట్యాంకు నిర్మాణం పూర్తయి 2011లో  ప్రారంభించినా..ఇంత వరకు చుక్క నీరు విడుదల కాలేదు.  గార్లపాడు ఆర్‌ఆర్ కాలనీలో 2007లో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెం, మల్లవరప్పాడు ఓవర్‌హెడ్ ట్యాంకులు దశాబ్ద కాలంగా నిరుపయోగంగా ఉన్నాయి. పొన్నలూరు మండలం విప్పగుంట స్కీం కేవలం స్విచ్‌వేసేవారు లేక నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉంది. పామూరు కొత్తపల్లిలో *10 లక్షలు వెచ్చించి ఓహెచ్‌ఆర్ ట్యాంక్ నిర్మించారు. కానీ పైప్‌లైన్, డీప్‌బోర్‌వెల్‌కు విద్యుత్ సరఫరాలేక ఐదునెలల నుంచి నిరుపయోగంగా ఉంది. కనిగిరి మండలంలో *175 కోట్లతో నిర్మిస్తున్న మంచినీటి పథకం పనులు నత్తనడకన కొనసాగుతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు.
 మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకులు నిరుపయోగంగా మారాయి. మార్కాపురం పట్టణంలో లక్షమంది జనాభాకు గాను 30 వేలమందికి మాత్రమే సాగర్‌నీరు అందుతోంది. యర్రగొండపాలెం, దోర్నాల మండలాల్లోని 48 గ్రామాల ప్రజలకు సాగర్‌నీరు సరఫరా చేసేందుకు  యర్రగొండపాలెంలో పాలకేంద్రం ఎదురుగా నిర్మించిన పంప్‌హౌస్, ట్యాంకు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. రెండు గ్రామాలకు సైతం నీరందించలేని పరిస్థితి నెలకొంది.
 ఉమ్మడివరంలో 18 నెలలుగా రక్షిత మంచినీటి పథకం మూలనపడింది. పర్చూరు మండలంలో ఆరు గ్రామాల్లో ఫిల్టర్‌బెడ్‌లు పనిచేయడం లేదు. నాలుగు గ్రామాల్లో ట్యాంకులు శిథిలావస్థకు చేరాయి. మార్టూరు మండలంలోని బొల్లాపల్లిలో తాగునీటి కోసం రక్షిత మంచినీటి పథకం నిర్మించినా పదేళ్ల నుంచి చుక్క నీరు విడుదల కాలేదు. బొబ్బేపల్లిలో కోటి రూపాయల నిధులతో తాగునీటి పథకాన్ని నిర్మించారు. అయితే ట్యాంకులోకి నీరు ఎక్కకపోవడం వల్ల ఆగ్రామ ప్రజలకు రక్షిత నీరు అందడం లేదు. గిద్దలూరు, బేస్తవారిపేట మండలాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం, మోటార్లు కాలిపోవడం వంటి పలు కారణాలతో మంచినీటి పథకాలు పనిచేయడం లేదు. కందుకూరు నియోజకవర్గంలో దాదాపు 20 పథకాలు ప్రజలకు చుక్కనీరు కూడా అందించలేకపోతున్నాయి. వేటపాలెం మండలంలో *70 లక్షలతో నిర్మించిన రెండు తాగునీటి పథకాలు, చీరాల మండలంలో నాంది స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లు సైతం పనిచేయకపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అద్దంకి నియోజకవర్గంలోను నిర్మాణం పూర్తయిన ఓవర్‌హెడ్ ట్యాంకులు, మినరల్ వాటర్ ప్లాంట్లు ఏళ్ల తరబడి ప్రారంభానికి నోచుకోకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి.

మరిన్ని వార్తలు