పెను తుపాను! 

28 Apr, 2019 03:31 IST|Sakshi
తుపాను తీవ్రతను తెలుపుతున్న ఉపగ్రహ చిత్రం

నేడు అతి తీవ్ర తుపానుగా ‘ఫణి’ బలోపేతం.. 30న కోస్తాంధ్ర తీరం చేరువలోకి..

ఆపై దిశ మార్చుకుని బంగ్లాదేశ్‌ వైపు పయనించేందుకూ వీలు

ఆ సమయంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు

ప్రస్తుతం మచిలీపట్నానికి 1,390 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతం

మే 2వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరిక  

ఈ నెల 30, మే 1న తమిళనాడు,దక్షణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం 

తుపాను ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడే చెప్పలేమంటున్న వాతావరణ నిపుణులు

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: తుపాను ఫణి (ఫొణిగా కూడా వ్యవహరిస్తున్నారు) తన దిశను మార్చుకుంటోంది. తీవ్రతను సైతం పెంచుకుంటోంది. శనివారం ఉదయం తీవ్ర వాయుగుండం నుంచి తుపానుగా మారిన అనంతరం మధ్యాహ్నానికే తీవ్ర తుపానుగా బలపడింది. ఆదివారం నాటికి మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారనుంది. ప్రస్తుతం ఈ తుపాను గంటకు 9 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోంది. శనివారం రాత్రికి ఈ తీవ్ర తుపాను చెన్నైకి ఆగ్నేయంగా 1,200 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1,390 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 30వ తేదీ నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు పయనిస్తుంది. అనంతరం ఈశాన్య దిశగా మలుపు తిరిగి బంగ్లాదేశ్‌ వైపు మళ్లే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా మే 2వ తేదీ వరకు బంగాళాఖాతంలోనే పయనించి పెను తుపానుగా బలపడే వీలుందని వారు అంచనా వేస్తున్నారు.  

అంచనాకు అందట్లేదు..
ప్రస్తుతం ఫణి తుపాను తీరును బట్టి అది ఎక్కడ తీరాన్ని దాటుతుందో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఇంకా ఒక అంచనాకు రాలేకపోతోంది. మరోవైపు తుపాను ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో ఆదివారం గంటకు 125–150, సోమవారం 145–170, మంగళ, బుధవారాల్లో 125–150 కిలోమీటర్ల వేగంతో బలమైన పెనుగాలులు వీస్తాయని ఐఎండీ శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రల్లో గంటకు 50–70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మే 2వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. 

దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వానలు  
ఫణి తుపాను ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల మంచి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ, వచ్చే నెల ఒకటో తేదీన తమిళనాడు, దక్షణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ‘‘ప్రస్తుతం తుపాను తీరానికి చాలా దూరంలో ఉంది. అందువల్ల దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేం. మరో 24 గంటల తర్వాత కొంత వరకూ పరిస్థితిని అంచనా వేయవచ్చు. మొత్తం మీద చూస్తే ఈ తుపాను దక్షిణ కోస్తా, తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ దక్షిణ కోస్తా, తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 30, మే 1వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు.  

నిజాంపట్నం హార్బర్‌లో రెండో నెంబర్‌ ప్రమాద సూచిక 
ఫణి తుపాను హెచ్చరికల నేపథ్యంలో గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో శనివారం రెండో ప్రమాద సూచిక ఎగురవేశారు. తుపాను ఈ నెల 30న లేదా మే ఒకటో తేదీన తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారని పోర్టు కన్జర్వేటర్‌ మోపిదేవి వెంకటేశ్వరరావు వివరించారు. తుపాను ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. 

అల్లకల్లోలంగా మారిన సముద్రం 
తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంత ప్రజలను ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఎప్పుడేం జరుగుతుందోనని తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాకాడు వద్ద సముద్రం దాదాపు 15 మీటర్లు ముందుకొచ్చింది. విడవలూరు వద్ద సముద్రంలో అలలు ఉధృతంగా ఉన్నాయి. మత్స్యకార ప్రాంతాల్లో పోలీసులు, రెవెన్యూ  అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తీర ప్రాంతానికి ప్రత్యేక బలగాలను పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామని నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ తెలిపారు. 

విశాఖ జిల్లాలో వర్షాలు  
విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. వర్షంతోపాటు ఈదురు గాలుల ధాటికి విద్యుత్‌ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. మామిడి పంట నేల రాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. విద్యుత్‌ తీగలు తెగిపడడంతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. నర్నీపట్నం, కోటవురట్ల, డుంబ్రిగుడ, అరకులోయ, రావికమతం, నాతవరం, గొలుగొండ తదితర మండలాల్లో వర్షాలు కురిశాయి. నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయం సమీపంలో విద్యుత్‌ లైన్‌పై తాటిచెట్టు విరిగిపడడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. డుంబ్రిగుడ, నర్సీపట్నంలో ఈదురు గాలుల తీవ్రతకు హోర్డింగ్‌లు విరిగి పడ్డాయి. 

భారీ వర్షాల ఆశలు గల్లంతేనా? 
తుపాను వస్తుంది.. మంచి వానలు తెస్తుందని ఆశించిన రాష్ట్ర ప్రజల ఆశలు గల్లంతయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముందుగా అంచనా వేసినట్టుగా ఫణి తుపాను ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుతుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఇది తీవ్ర, అతి తీవ్ర తుపానుగా బలపడినప్పటికీ తన దిశను కోస్తాంధ్ర వైపు కాకుండా బంగ్లాదేశ్‌ వైపు మార్చుకునే అవకాశం లేకపోలేదని, దీంతో తేలికపాటి వర్షాలు తప్ప భారీ వర్షాలు కురిసే వీలు లేనట్టేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో తేలికపాటి జల్లులు లేదా వర్షాలు కురవవచ్చని ఐఎండీ తెలిపింది. 30న కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో, మే ఒకటో తేదీన కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా నమోదు కానున్నాయి. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలివీ..(డిగ్రీల్లో) 

మరిన్ని వార్తలు