అంబులెన్స్‌కు దారివ్వకపోతే..మోతే!

29 Jun, 2019 09:32 IST|Sakshi

సాక్షి, కడప :  ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లఘించే వారికి భారీగా జరిమానా విధించనున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. ఇప్పటి వరకు విధించే జరిమానాలన్నీ కొన్ని రెట్టింపు కాగా మరికొన్ని రెండు మూడు రెట్లు పెంచుతూ మంత్రి వర్గం తీర్మానించింది. చిన్న పిల్లలకు (మైనర్లు) వాహనాలు ఇస్తే పిల్లల తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు  రూ.20 వేలు జరిమానాతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు.

అలాగే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేసే అవకాశం ఉంది. ఒక వేళ పిల్లలు ప్రమాదం చేస్తే తల్లిదండ్రులు, సంరక్షకులను దోషులుగా నిర్ధారిస్తారు. అంబులెన్స్‌కు దారివ్వకపోతే రూ.10 వేలు పైన్‌ కట్టాల్సి ఉంటుంది. వాహనం నడిపేట ప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లఘించే వారికి భారీగా జరిమానాలు విధించేలా నూతన బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. డ్రైవింగ్‌కు అనర్హులై  వారు వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా చెల్లించాలి. ఇక డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉల్లంఘనలకు పాల్పడే వాహనాదారులకు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. 

అతివేగానికి కళ్లెం
రోడ్లపై అతివేగంగా దూసుకెళ్లే వాహనాదారులకు రూ.1000 నుంచి రూ.2వేలు జరిమానా విధించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. బీమా లేకుండా వాహనం నడిపితే రూ.2వేలు జరిమానా చెల్లించాలి. అలాగే సీటు బెల్ట్‌ ధరించకపోతే రూ.1000 జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించినా రూ.1000 జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తారు. ట్రాపిక్‌ సిగ్నల్స్‌ ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా విధిస్తారు. అధికారులు అదేశాలు పాటించకుంటే గతంలో రూ.500 పెనాల్టీ విధించేవారు. ఇప్పుడు దానిని రూ.2వేలకు పెంచారు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే రూ.5 వేలు, మితిమీరిన వేగంతో ప్రమాదకరంగా నడిపితే రూ.5వేలు, మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా కట్టాలి. అలాగే రవాణా చేసే వాహనాలు ఓవర్‌ లోడింగ్‌ చేస్తే రూ.20 వేలు పెనాల్టీ చెల్లించేలా నిబంధనల్లో మార్పులు చేశారు. ఇలాంటి నిబంధనలు స్వయంగా సంబంధిత అధికారులు ఉల్లంఘిస్తే జరిమానాలు రెట్టింపు అవుతాయి. దీనికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నిబంధనలు అమలులోకి వస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ఇటీవల కాలంలో జిల్లాలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు బాగా పెరిగాయి. ఈ బిల్లు ఆమోదం పొందితే ఇలాంటి కఠిన నిబంధనలతో తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గుతుంది.
 

>
మరిన్ని వార్తలు