ప్రకృతి సాగు.. విదేశాలకేగు

12 Sep, 2018 13:32 IST|Sakshi
ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయలను పరిశీలిస్తున్న ఏఓ

యూరప్‌కు తరలుతున్న కొరిశపాడు ఉత్పత్తులు

ఆదాయం అధికంగా వస్తుండటంతో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు

రెండు వేల ఎకరాల్లో ఈ ఏడాది వేసేందుకు సిద్ధం

మన దేశంలో పండిన వ్యవసాయ ఉత్పత్తుల్లో, క్రిమి సంహారక మందుల అవశేషాలు ఉంటున్నాయనే నెపంతో, అమెరికా వంటి దేశాలు, మన ఉత్పత్తులను కొనుగోలు చేయడం లేదు. ఈ క్రమంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రకృతి వ్యవసాయం చేయాలని రైతులకు సలహా ఇచ్చారు. ఆ సలహాలను పాటించిన కొరిశపాడు మండల రైతులు కొందరు, తాము పండించిన ఉత్పత్తులను యూరోపియన్‌ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. హాని లేని ఆహారోత్పత్తులకు విదేశాల్లో గిరాకీ ఉండటంతో ఆదిశగా అడుగులేస్తూ లాభాలు గడిస్తున్నారు.

మేదరమెట్ల: ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహారోత్పత్తులు, మనిషికి హాని చేయవు, మంచి చేస్తాయి. అదే విధంగా నేలకు మేలు చేస్తాయి. ప్రస్తుతం రైతులు విచ్చలవిడిగా వాడుతున్న క్రిమి సంహారక మందులు, రసాయన ఎరువుల వల్ల, భవిష్యత్తులో నేల ఆరోగ్యంతో పాటు మానవాళి, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. అలా పాడవకుండా ఉండడం కోసం,  భావి తరాలకు బంగారు భవిష్యత్తును అందించాలంటే, ప్రకృతి వ్యవసాయమే ప్రత్యామ్నాయం అని వ్యవసాయాధికారులు చెపుతున్నారు.

పురుగు మందుల వల్ల కలిగే నష్టాలు..
పంటలపై విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాలతో, ఆహారోత్పత్తుల వ్యయం, పెరిగి రైతులకు సేద్యం మోయలేని భారంగా మారుతోంది. మరో వైపు భూసారం క్షీణిస్తుంది. ఉత్పాదకత పడిపోతుంది. ఆహార పదార్థాల్లో రసాయనాలు, పురుగుమందుల అవశేషాలు అధిక మొత్తంలో నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారు. 

హాని లేని ఉత్పత్తులకు యూరప్‌లో గిరాకీ..
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు యూరప్‌ దేశాల్లో ఎక్కువ గిరాకీ ఉందని రైతులు వరి, మినుము, కొర్రలు, వరిగ, కంది, శనగ, మునగ, కరివేపాకు, బొప్పాయి, కూరగాయలు, ఆకుకూరలతో పాటు యాపిల్‌రేగి, జామ పంటలను పూర్తిగా గోఆధారిత ప్రకృతి సేద్యం పద్ధతుల్లో పండించడం వల్ల ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించడం జరిగిందని వ్యవసాయాధికారి తెలిపారు. సేంద్రియ పద్ధతిలో సాగు బాగుండడంతో, గత ఏడాది కొరిశపాడు మండలంలోని పలు గ్రామాల్లో 1100 ఎకరాల్లో ప్రకృతి వ్యసాయం చేశారు. ఈ సంవత్సరం 2 వేల ఎకరాల్లో ఈ పద్ధతి ద్వారా పలు రకాల పంటలను పండించేందుకు రైతులను సిద్ధం చేస్తున్నట్లు ఏఓ ప్రసాదరావు చెప్తున్నారు.

షేడ్‌నెట్లలో ఉత్పత్తులకు గిరాకీ.....
ఎనిమిది అడుగుల ఎత్తు కలిగిన షేడ్‌నెట్‌లలో పండించిన ప్రకృతి ఉత్పత్తులకు విదేశీమార్కెట్‌లో ఎక్కువ డిమాండ్‌ ఉంది. వీటిలో మిరప, ఉల్లి పంటలకు గిరాకీ అధికంగా ఉందని, పంటను కోసిన 24 గంటల లోపు విమానసర్వీసులు ఉన్న ప్రదేశాలకు తరలిస్తే వాటిని యురోపియన్‌ దేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుంటుంది. కనుక రైతులు షేడ్‌నెట్‌లలో పంటలను పండించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారి సూచిస్తున్నారు.అంతే కాకుండా మునగ ఆకును కూరగానూ, ఔషధాల తయారీలోనూ ఎక్కువగా వినియోగించడం వల్ల మునగ ఆకును కూడా విదేశాలకు తరలించేందుకు రైతులు ముందుకు రావాలని, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన అల్లం, పసుపుకు కూడా మంచి గిరాకీ ఉండటంతో రైతులు విదేశాల్లో డిమాండ్‌ ఉన్న పంటలను ప్రకృతి సాగు ద్వారా పండించాలని వ్యవసాయాధికారి సూచిస్తున్నారు.

ప్రకృతి వ్యవసాయం ఎంతో లాభదాయకం..
పురుగుమందులు, రసాయన ఎరువులు విచ్చలవిడిగా వినియోగించి వ్యవసాయం చేయడం వల్ల పండించే పంట పూర్తిగా నాశిరకంగానూ, విషతుల్యమైన ఆహార పదార్థాలుగా ఉండేందుకు అవకాశం ఉంది. కానీ ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలను పండించడం ద్వారా రైతులకు అధిక దిగుబడులతో పాటు పంట ఉత్పత్తులను వినియోగించుకునేవారికి ఆరోగ్యం లబిస్తుంది. అందుచేత ఒక ఎకరా 20 సెంట్ల భూమిలో జామతోటను వేయడం జరిగింది. కేవలం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగు చేయడం జరుగుతుంది.కామిరెడ్డి, రైతు బొడ్డువానిపాలెం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా