ఈదరపై వేటుకు రంగం సిద్ధం

5 Aug, 2014 02:37 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా పరిషత్ చైర్మన్‌పై వేటుకు రంగం సిద్ధమైంది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన ఈదర హరిబాబును కొనసాగించడానికి వీల్లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మన్నెం రవీంద్రతో పాటు చంద్రబాబునాయుడిని కలిశారు.

 ఈదరను పార్టీలోకి తీసుకుంటే  కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉందని బాబు వద్ద జనార్దన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును దామచర్ల జనార్దన్ కలిసిన కొద్ది సేపటికే జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు కూడా ఆయన్ను కలిసి చర్చించారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన అంశంపై ఇప్పటికే ఈదర హరిబాబుపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ పార్టీ అధ్యక్షుడ్ని కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తరువాతే.. టీడీపీ తర ఫున విప్ జారీ చేసిన అభ్యర్థి, టీడీపీకి చెందిన అడ్వకేట్లు జిల్లా ఎన్నికల అధికారిని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రకాశం జిల్లాలో పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించిన ఈదర హరిబాబును ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని చంద్రబాబు దృష్టికి తీసుకురాగా ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. బలరాం కూడా తప్పని పరిస్థితుల్లో ఈదరపై వేటుకు అంగీకరించినట్లు సమాచారం. అందువల్లే ముందుగా జనార్దన్ కేవియట్ పిటీషన్ ద్వారా ఈదరకు కోర్టు ద్వారా స్టే పొందేందుకు వీలులేకుండా యత్నించారని తెలుస్తోంది.

 ఇదిలా ఉంటే ఈ విషయమై దామచర్ల జనార్దన్  ఫోన్‌లో మాట్లాడుతూ జిల్లాలోని కొంత మందికి నామినేటెడ్ పోస్టుల విషయమై తాము సీఎంను కలిశామని తెలిపారు. మార్కెటింగ్ యార్డు తదితర పోస్టుల విషయమై జిల్లాకు చెందిన పలువురిని బాబు వద్దకు తీసుకువెళ్లినట్లు వివరించారు. పార్టీ అధ్యక్షుడు ఆదివారమే నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు