పదిలోనే ఇంటర్‌

12 Dec, 2017 09:00 IST|Sakshi

తమ కళాశాలల్లో చేరాలంటూ ఇళ్ల వద్దకు ప్రదక్షణ

రాయితీలు ఇస్తామంటూ తల్లిదండ్రులకు ఎర

పట్టించుకోని అధికారులు

కడప ఎడ్యుకేషన్‌: మీ పిల్లవాడు ఫలానా పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడని తెలిసింది. మీ వాడిని ఇంటర్‌కు మా కళాశాలలో  చేర్పిస్తే ఫీజులో రాయితీ ఇస్తాం. పదిలో మంచి గ్రేడ్‌ తెచ్చుకుంటే మరింత ఎక్కువ రాయితీ ఇస్తాం అంటూ పిల్లల తల్లితండ్రులకు ఎరవేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కడప, పొద్దుటూరు, రాజంపేట, రాయచోటిలతోపాటు పలు పట్టణాల్లో జరుగుతున్న తంతు.  విద్యార్థుల తల్లితండ్రులతో ఫోన్‌లో కూడా చర్చలను సాగిస్తున్నారు. ఎప్పుడో జూన్‌లో మొదలయ్యే అడ్మిషన్ల కోసం ఇప్పటి నుంచే రంగంలోకి దిగారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వీరి వ్యవహరం సాగుతోందనే అరోపణలు ఉన్నాయి.   జిల్లాలో ఈఏడాది సుమారు 36,283 వేలమంది పదో తరగతి పరీక్షలను రాయనున్నారు. వీరిలో ఎక్కవశాతం ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం వీరందరిపైన కార్పొరేట్‌ కళాశాలలు ప్రత్యేక దృష్టి సారించా యి. విద్యార్థులకు సంబంధించిన చిరునామాలను సేకరించి వారి ఇళ్ల వద్దకు వెళ్లి తల్లిదండ్రులతో చర్చించి కళాశాలల్లో చేర్చుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ముందుగానే అడ్వాన్స్‌ఫీజు: కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఇప్పటికే తమ వద్ద ఉన్న విద్యార్థులు ఇంటర్‌లో ఎటూ జారిపోకుం డా పదో తరగతి ఫీజు కట్టేటప్పుడే ఇంటర్‌కు కొంత అడ్వాన్స్‌ కట్టించుకు ని అడ్మిషన్‌ను బుక్‌ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇలా ముందుగా సీటు ను రిజర్వు చేసుకుంటే ఎక్కువశాతం రాయతీ ఇస్తామంటూ  తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు.  తరువాత ఆ కళాశాలలో  చేరమంటే మా త్రం కట్టించుకున్న ఫీజును మాత్రం తిరిగి ఇవ్వరు. ఇది కూడా ప్రైవేటు కళాశాలలకు ఒక వ్యాపారమే.

సిబ్బందికి టార్గెట్లు: కళాశాలలలో పనిచేసే సిబ్బందితోపాటు అధ్యాపకులకు టార్గెట్లు  పెడుతున్నట్లు తెలిసింది. దీంతో వారంతా ఉద్యోగ భద్రత కోసం ఆదివారం విద్యార్థుల ఇళ్లవద్దకు వెళ్లి  తల్లితండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం, ఫీజు రాయితీల గురించి వివరిస్తున్నారు. మరి కొంతమంది పక్కవాళ్లకు కమీషన్‌ ఇచ్చి మరీ అడ్మిషన్లు తెప్పించుకుంటున్నట్లు సమాచారం.  
పదో తరగతి అర్థ సంవత్సరం(సమ్మెటివ్‌–1) పరీక్షలు కూడా ప్రారంభం కాక ముందే ప్రైవేటువారు ప్రవేశాల కోసం ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. దీనిపై ఇంటర్‌ అధికారులు స్పందించి కట్టడి చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయం గురించి ఆర్‌ఐఓ వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

మరిన్ని వార్తలు