పత్తిరైతుకు పుట్టెడు కష్టాలు

2 Dec, 2013 01:58 IST|Sakshi

 పర్చూరు, ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్:
 భారీ వర్షాలు, వరుస తుపాన్లు రైతుల వెన్ను విరిచాయి. జిల్లాలోని పత్తి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో సుమారు 57 వేల హెక్టార్లలో పత్తిపైరు సాగైంది. ప్రస్తుతం వర్షాలకు దెబ్బతిన్న పైర్లు పీకేయగా..మిగిలినవి ఓ మోస్తరు దిగుబడి ఇస్తున్నాయి. పత్తితీత పనులు కూడా ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. రైతుల ఇళ్లకు పత్తి వచ్చి చేరుతోంది. బయట మార్కెట్లో నాణ్యమైన పత్తికి * 4,400 ధర ఉన్నా..దళారులు, వ్యాపారులు నాణ్యత పేరుతో * 2,500 నుంచి * 3 వేలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అసలే దిగుబడులు తగ్గి ఆందోళనలో ఉన్న రైతులను ఈ పరిణామం మరింత కలవరానికి గురిచేస్తోంది. ఇంత కష్టపడి సాగుచేస్తే హెక్టారుకు 15 క్వింటాళ్లు రావడం గగనమైపోతోంది. వర్షాలకు దెబ్బతిని ఇప్పుడిప్పుడే ఇగురుకాపు వస్తున్న పైర్లు దిగుబడులు ఇస్తాయా లేదా అన్న అనుమానం రైతుల్లో ఉంది.
 
 ఈ నేపథ్యంలో పత్తిని అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం పత్తికి ప్రభుత్వ ధర క్వింటా *4 వేలుగా ప్రకటించింది. నాణ్యమైన పత్తిని ఎలాగూ ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తారు. ఇదే వర్షాలకు దెబ్బతిన్న పైర్లనైతే కొనుగోలు చేసేందుకు  అంతగా ఆసక్తి చూపరు. ఒకవేళ కొనుగోలు చేసినా వారికి తోచిన ధరే ఇస్తారు. దీంతో రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం సీసీఐని రంగంలోకి దించి ఆదుకుంటుందని రైతాంగం ఆశిస్తోంది. అయితే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. సీసీఐ నిబంధనలు పక్కనపెట్టి  తడిసి కొద్దిగా నాణ్యత దెబ్బతిన్న పత్తిని కూడా ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తే రైతులకు కొంత ఊరట కలుగుతుంది.
 
 పత్తిరైతులపై ప్రభుత్వాల చిన్నచూపు...
 పత్తి దిగుబడిలో గుజరాత్, మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అయినా పత్తి ఆధారిత పరిశ్రమలు 40 శాతం తమిళనాడులో ఉన్నాయి. పత్తి రైతులను ఆదుకునే విషయంలో మన ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. రాష్ర్టంలో ఉన్న పరిశ్రమలకు సరిపోను మిగతా పత్తిని తమిళనాడుకు తరలించాలంటే రవాణా ఖర్చులు అధికమవుతున్నాయి. దీంతో వ్యాపారులు రవాణా ఖర్చులు, మిగతా ఖర్చులు సరిచూసుకొని గిట్టుబాటయ్యే ధరకు మాత్రమే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. దీని కారణంగా మన రాష్ట్ర పత్తిరైతులకు న్యాయమైన ధర లభించడం లేదని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.
 
 వ్యాపారులకే జై కొడుతున్న సీసీఐ అధికారులు
 ఏటా రైతాంగాన్ని ఆదుకునే పేరుతో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్న అధికారులు రైతుల వద్ద నుంచి మొక్కుబడిగా కొనుగోళ్లు చేస్తూ వ్యాపారులకు దోచిపెడుతున్నారు. రైతాంగాన్ని దగా చేసి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్న దళారులు, వ్యాపారులు సీసీఐ కేంద్రాల్లో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. రైతుల వద్ద కొనుగోలు చేస్తే సీసీఐ బయ్యర్లకు మిగిలేది తక్కువ.. అదే వ్యాపారులైతే కొద్దొగొప్పో ముట్టచెప్తారు. వ్యాపారుల దగ్గర కొనుగోలు చేసిన పత్తి  సీసీఐ కొనుగోలు కేంద్రాలతో పనిలేకుండా నేరుగా సీసీఐ లీజుకు తీసుకున్న మిల్లుల వద్దకు చేరుతుంది. అయినప్పటికీ సీసీఐ కేంద్రాలకు వచ్చినట్లుగానే మార్కెటింగ్ శాఖకు సెస్సు, హమాలీల కూలీ ఇవ్వడం కొసమెరుపు. ఈ వ్యవహారంలో మార్కెటింగ్ శాఖ సిబ్బంది కూడా పాలుపంచుకోవడం గమనార్హం..
 
 ఎక్కువ సంఖ్యలో సీసీఐ కేంద్రాలు
 పెడితేనే రైతులకు మేలు:
 పత్తి రైతాంగాన్ని ఆదుకోవాలంటే కనీసం పత్తి కొనుగోలు కేంద్రాలను ముందుగానే ఏర్పాటు చేయాలి.  పశ్చిమప్రాంతంతో పాటు పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో 10కిపైగా ఏర్పాటు చేస్తే తప్ప ఈ ఏడాది రైతులు కోలుకోరు. గత ఏడాది పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో సీసీఐ కేంద్రాలు 5 మాత్రమే తెరిచారు. అయితే పశ్చిమ ప్రాంతంలో ముందుగా ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఆ ప్రాంత రైతాంగం దళారుల చేతిలో చిక్కి తీవ్రంగా నష్టపోయారు. రైతులు, రైతు సంఘాల ఆందోళనల పుణ్యమా అని చివరిలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినా అప్పటికే 80 శాతానికిపైగా పత్తి దళారుల చేతిలోకి వెళ్లింది.
 

మరిన్ని వార్తలు