జేసీపై చర్యలు తీసుకోవాలని నిరసన

27 Aug, 2014 02:37 IST|Sakshi

కడప సెవెన్‌రోడ్స్ : ప్రజావాణి కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.రామసుబ్బారెడ్డి సమర్పించిన అర్జీని చించి వేసి అపహాస్యం చేసిన జాయింట్ కలెక్టర్ రామారావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఐ నగర కార్యదర్శి జి.చంద్ర డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ ఎదుట సీపీఐ కార్యకర్తలు జేసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశిస్తున్నా, జేసీ మాత్రం అందుకు తిలోదకాలిచ్చారన్నారు.  
 
ప్రజావాణి కార్యక్రమాల్లో తమ సమస్యలను విన్నవించి పరిష్కరించుకోవాలని వస్తుంటారని పేర్కొన్నారు. సమస్యను తహశీల్దార్ కార్యాలయంలోనే పరిష్కరించుకోవాలంటూ జేసీ సూచించారన్నారు. అయితే, అనేకసార్లు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లినప్పటికీ తన సమస్య పరిష్కారం కాకపోవడంతోనే కలెక్టర్ ప్రజావాణికి వచ్చానని రామసుబ్బారెడ్డి బదులివ్వడంతో జేసీ ఆగ్రహించి అర్జీని చించి వేశారని వివరించారు.  
 
జేసీపై చర్యలు తీసుకోకపోతే వచ్చే ప్రజావాణిలో ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.రామసుబ్బారెడ్డి, సహాయ కార్యదర్శి మనోహర్‌రెడ్డి, రూరల్‌శాఖ అధ్యక్ష, కార్యదర్శులు శంకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఇ.బాలచంద్రయ్య నాయుడు, వెంకట రమణ, దళిత హక్కుల పోరాట సమితి నాయకుడు కృష్ణయ్య, ఏఐటీయూసీ నాయకుడు లింగన్న, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి గంగాసురేష్  పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు