సైకో కిల్లర్‌కు ఉరిశిక్ష

18 Aug, 2017 07:44 IST|Sakshi
సైకో కిల్లర్‌కు ఉరిశిక్ష

నెల్లూరు అదనపు సెషన్స్‌ కోర్టు తీర్పు
నెల్లూరు (లీగల్‌): అతి కిరాతకంగా నలుగురిని హత్య చేసి.. మరో నలుగురిని హతమార్చేందుకు ప్రయత్నించిన ఉన్మాది కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్‌ వెంకటే‹ష్‌కు ఓ కేసులో ఉరి శిక్ష విధిస్తూ నెల్లూరు 4వ అదనపు సెషన్స్‌ కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు ప్రస్తుతం జంట హత్యల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తుండగా.. మహిళను హత్య చేసిన మరో కేసులో అతడికి ప్రాణం పోయేవరకు ఉరి తీయాలంటూ సెషన్స్‌ కోర్టు జిల్లా జడ్జి బి.శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు.

టీచర్‌గా పనిచేస్తూ నెల్లూరు శ్రీసాయి నగర్‌లో నివాసముండే రావిప్రోలు ప్రభావతిని గత ఏడాది జూలై 9న వెంకటేష్‌ దారుణంగా హతమార్చాడు. ఆమె ఇంట్లో ఉండగా.. వెంకటేష్‌ ఇంట్లో జొరబడి ప్రభావతి తలపై సుత్తితో విచక్షణా రహితంగా కొట్టాడు. అడ్డుకునేందుకు వెళ్లిన ఆమె సోదరి కుమారుడు అనంతకృష్ణ, సోదరి కుమార్తె మాధురిపైనా దాడి చేసి వారి తలలు పగులగొట్టాడు. వారి బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లను అపహరించుకుపోతుండగా.. ప్రభావతి భర్త నాగేశ్వరరావు అటకాయించారు. స్థానికులు వచ్చి వెంకటేష్‌ను పట్టుకుని బాలాజీ నగర్‌ పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన ప్రభావతి మృతి చెందారు.  

అనంతకృష్ణ, మాధురి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వెంకటేష్‌ చేసిన నేరం రుజువు కావడంతో అతనికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి బి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నిందితుడు వెంకటేష్‌ పెద్దచెరుకూరు శివాలయం పూజారి దంపతులు నూతలపాటి చంద్రమౌళీశ్వరరావు, పుష్పవేణిలను హత్య చేసిన కేసులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.  కావలి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ హత్య కేసులోనూ అతను నిందితుడు. వెంకటేష్‌ మొత్తం నాలుగు హత్యలు, నాలుగు హత్యాయత్నాలకు పాల్పడ్డాడు. ఇతడిపై పలు దోపిడీ కేసులు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు