నాని అండతో రెచ్చిపోతున్నారు

22 Jan, 2019 11:36 IST|Sakshi
వేణుగోపాల్‌ను హింసిస్తున్న నాని అనుచరులు

నడిరోడ్డుపై పిస్తోలు ఎత్తినా కేసు లేదు

చంద్రగిరిలో నిత్యం దళితులపై దాడులు

చిత్తూరులోనూ అదే తీరు..

తాజాగా వడ్డెర యువకుడిని చిత్రహింసలు పెట్టిన వైనం

పులివర్తి నాని.. రెండేళ్ల క్రితం వరకు ఈ పేరంటే జిల్లాలో ఎవరికీ తెలియదు. చినబాబు పుణ్యామా అంటూ పదవి అలా చేతికి వచ్చిందో లేదో జిల్లాలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. వీధి ఏదైనా, వాడ ఏదైనా తన దౌర్జన్యానికి దాసోహం అనాల్సిందేనంటున్నారు. ఇక ఆయన అనుచరగణం మామూలుగా ఉంటుందా? అదే స్థాయిలో రెచ్చిపోతోంది.

సాక్షి, తిరుపతి : నాని పేరు చెప్పి చిత్తూరు నుంచి చంద్రగిరి దాకా దాష్టీకాలు పెరిగిపోతున్నాయి. పిస్తోలుతో బెదిరింపులకు దిగినా, దళితులపై దౌర్జన్యాలు చేయించినా ఆయన హవా నడుస్తూనే ఉంది. ప్రశ్నించే పోలీసు లేడు...ఇదేంటని అడిగే అధికారీ లేడు. ‘నేను నాని అనుచరుడిని ఎవడ్రా నాపై చేయి వేసేది’ అంటూ నడిరోడ్డుపై సినీ ఫక్కీలో పట్టాకత్తితో హల్‌చల్‌ చేసినా పోలీసులకు అటువైపు చూసే ధైర్యం కూడా లేదు. ఇంతకీ ఇంత ధైర్యం, దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? అంతా ‘చినబాబు(లోకేష్‌)కు నేను ఎంత చెప్పితే అంతే’ అని మభ్యపెడుతూ, కలరింగ్‌ ఇస్తూ అధికారులను హుకుం జారీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా కేవలం కోడిని దొంగతనం చేశాడని వడ్డెర కులానికి చెందిన వ్యక్తిని మూడు గంటపాటు నిర్బంధించి చేయి విరిచి, చిత్రహింసలకు గురి చేసి చంపేస్తామని బెదిరించిన ఘటన వెలుగు చూసింది. ఇందులో నాని ప్రధాన అనుచరుడు చిట్టిబాబు నాయుడు నిందితుడు. అయినా సరే ఇతడ్ని అరెస్టు చేయలేదు. పోలీసులు బెయిలబుల్‌ సెక్షన్‌ కింద కేసు పెట్టి చేతులుదులుపుకున్నారు. అతనిపై ఈగ కూడా వాలనివ్వకుండా నాని అనే పేరు కాపాడుతోంది.

దాష్టీకాలకు సాక్ష్యాలు..
చంద్రగిరి మండలం మొరవపల్లి దళితవాడకు చెందిన పుత్తా రవి అనే దళితుడిని నాని అనుచరులు గతేడాది నవంబర్‌ 13న హత్య చేయడానికి ప్రయత్నించారు. పండుగ సందర్భంగా తనకు ఇష్టమైన నాయకుడి ఫొటోతో ఫ్లెక్సీలను వేయటమే ఆ దళితుడు చేసిన పాపం. అతన్ని వెంటాడి కారుతో గుద్దించి, కర్రలు, రాడ్‌లతో చంపేందుకు నాని అనుచరులు ప్రయత్నించా రు. రోడ్డుపై వెళ్లే వాహనాల్లోని ప్రయాణికులు గుర్తించి అడ్డుకోకుంటే అతన్ని అక్కడే చంపేసేవాళ్లు. హత్యాయత్నం వల్ల అతను వినికిడి శక్తిని కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసినా నిందితులను మాత్రం అరెస్ట్‌ చేయలేదు.

గత నెల 18న తిరుపతి రూరల్‌ మండలం అవిలాల పంచాయతీలో దళితుడైన శ్రీరాములను అంతు చూస్తామంటూ నాని రెచ్చిపోయాడు. సాక్ష్యత్తు నానినే దౌర్జన్యాలకు, బెదిరింపులకు దిగటంతో అదే సమయంలో అతని అనుచరులు సైతం రెచ్చిపోయారు.

గత నెల 21న తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలోని దామినేడులో ఫ్లెక్సీల రగడతో నాని అనుచరులు రెచ్చిపోయి నిఖిల్‌ అనే వ్యక్తిపై హత్యాయత్నంకు ప్రయత్నించారు. కర్రలు, రాడ్‌లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసినా చర్యలు మాత్రం అంతంతమాత్రమే.

ఈ నెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలోని ముంగిలిపట్టులో దామోదర్‌నాయుడుపై చిత్తూరు నుంచి వచ్చిన నాని అనుచరులు దాడి చేశారు. తమకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలను పెట్టారని జాతీయ రహదారిపైనే తరిమి తరిమి కొట్టారు. ప్రాణాలను కాపాడాలని ఆ వృద్ధుడు చేసిన ఆర్తనాదాలను రోడ్డు వెంట వెళ్లే ప్రయాణికులు విని, అతన్ని కాపాడారు.

2017లో చిత్తూరు చర్చి వీధిలో పూలమార్కెట్‌ తొలగింపునకు సంబంధించి వివాదం నెలకొంది. ఈ ఘటనలో స్థానిక మాజీ ఎమ్మెల్యే, నానికి మధ్య వాగ్వాదం జరిగింది. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలతో సహా పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో తన వద్ద ఉన్న తుపాకీ తీసుకున్న నాని కాల్పులు జరపబోయాడు. పక్కనే ఉన్న వ్యక్తి తుపాకీ లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. దీనిపై ఎక్కడా ఎలాంటి కేసూ నమోదు కాలేదు.

గతేడాది చిత్తూరు బజారు వీధిలో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొస్తుండగా శరవణ అనే వ్యక్తి పట్టాకత్తితో హల్‌చల్‌ చేశాడు. ‘‘నేను నాని అనుచరుడిని ఎవర్రా నాపై చేయి వేసేది? తలలు తీసుకెళుతా..’’ అంటూ నడిరోడ్డుపై కత్తిను గీటుతూ మోహన్‌ అనే వ్యక్తిని నరికాడు. ఈ వీడియో చక్కర్లు కొట్టగా తప్పనిసరి పరిస్థితుల్లో శరవణపై పోలీసులు కేసు పెట్టారు. ఇదే సమయంలో నాని మాటకాదలేక శరవణ నుంచి ఓ ఫిర్యాదు తీసుకుని మోహన్‌పై కూడా కేసు పెట్టి అరెస్టు చేశారు.

ఇప్పుడు పెనుమూరుకు చెందిన వేణుగోపాల్‌ అనే వడ్డెర కులస్తుడిపై నాని అనుచరుడు చిట్టిబాబు నాయుడు దాడి చేసి, చంపుతామంటూ బెదిరించిన వీడియో బయటకొచ్చింది. మనిషి మానవత్వం మరచి ఎలా ప్రవర్తిస్తాడనే దానికి ఈ వీడియోనే నిదర్శనం. ఇదే చిట్టిబాబునాయుడు చిత్తూరు టూటౌన్‌ కానిస్టేబుల్‌తో గొడవపడ్డాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపారు. నాని ప్రోద్బలంతో చిట్టిబాబునాయుడుపై ఎలాంటి కేసూ నమోదు చేయలేదు. పోలీసులు అష్రాఫ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వేణుగోపాల్‌కు చేయి విరిగినా, తీవ్ర రక్తగాయాలైనా, చంపేస్తామని బెదిరించినా నాన్‌బెయిలబుల్‌ సెక్షన్‌ ఎక్కడా నమోదు కాకపోవడం కొసమెరుపు.

మరిన్ని వార్తలు