‘గిరిజనులు సీఎం జగన్‌ను ఎప్పటికి మర్చిపోలేరు’

26 Sep, 2019 18:09 IST|Sakshi

సాక్షి, అమరావతి : గిరిజనుల అభిప్రాయాన్ని గౌరవించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బక్సైట్‌ తవ్వకాలను రద్దు చేశారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. గిరిజనులు పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. గిరిజనులు ఈ రోజు పండుగ చేసుకునే రోజని అన్నారు. గతంలో చంద్రబాబు గిరిజనుల సంపదను దోచుకోవాలని చూశాడని, బాక్సైట్ కోసం బాబు గిరిజన ఎమ్మెల్యేలను సైతం కొనుగోలు చేశాడని మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు పోరాడారని గుర్తు చేశారు. 

2015 లో చంద్రబాబు ఇచ్చిన 97 జీవో కు వ్యతిరేకంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పోరాడారని, ఆ సమయంలోనే వైఎస్‌ జగన్‌ బాక్సైట్ అనుమతులు రద్దు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం అయిన నాలుగు నెలల్లోనే గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌పై ఉన్న నమ్మకంతోనే గిరిజన ప్రాంతాల్లోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీని గెలిపించారని తెలిపారు. ఇక గిరిజనులు సీఎం జగన్‌ను ఎప్పటికి మర్చిపోరని అన్నారు. 

మరిన్ని వార్తలు