‘మూడు రాజధానులను స్వాగతిస్తున్నాం’

28 Dec, 2019 20:27 IST|Sakshi

సాక్షి, నరసాపురం: మూడు రాజధానుల ప్రతిపాదనపై అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, జనవరి 20న అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుందని ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరైన నిర్ణయం తీసుకుంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ అధికార వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పడినా అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా మండలం కొప్పర్రు గ్రామంలో రూ.1.20 కోట్లతో నిర్మించే డ్రైన్ నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

స్వాగతిస్తున్నా: కోటగిరి శ్రీధర్
మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ప్రకటించారు. జంగారెడ్డిగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అభివృద్ధి అనేది ఒక వర్గానికో, ప్రాంతానికో పరిమితం కాకూడదని అన్నారు. రూ.300 కోట్లతో కొల్లేరు ప్రాంతంలో రెగ్యులేటర్స్, 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్‌ ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్లే యోచనలో ఉన్నట్టు చెప్పారు. పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు.

మరిన్ని వార్తలు